
'వదినా! ఇది విన్నావా? థర్డ్ ఫ్లోర్‌లోని రమ్య, మాలతి లేచిపోయారట'.
'ఇదెక్కడి విడ్డూరం?' కుడిచేతి ఐదువేళ్లు వంకర్లు తిరుగుతూ నోటి మీదకు వెళ్లి కూర్చున్నాయి.
'నాకప్పుడే తెలుసు, ఇలాంటి కొంప మునిగే వ్యవహారం ఏదో జరుగుతుందని' ఒక త్రికాల జ్ఞాని స్టేట్‌మెంట్.
'ఏంటి గురూ, మనమెవ్వరమూ కనబడలేదా? ఆ సరదా తీర్చేవాళ్లంగా. వాళ్లిద్దరూ లేచిపోవడం ఏంట్రా?' సెల్లార్‌లో దమ్ములాగుతూ సోగ్గాడి మనోవేదన.
'అదే బాసూ, నాకు అర్థంకానిది' నిరాశపడ్డ సుందరాంగుని తీరని బాధ.
'యస్, ఐ నో... దే మే బీ లెస్బియన్స్' ఏదో నిగూఢ రహస్యం కనుగొన్న ఆనందం ఒక ఆంగ్ల సినిమా జ్ఞానిలో. మొత్తానికి ఆ అపార్ట్‌మెంట్ అంతా గోల గోలగా, గొడవ గొడవగా ఉంది.
ఏ అంతస్థులో చూసినా ఇవే చర్చలు... బృందాలుగా, జంటలుగా.
ఏ విధమైన శబ్ధాలూ లేనివి ఆ రెండు ఎదురెదురు ఫ్లాట్లు మాత్రమే. మెయిన్ డోర్లు లోపలనుంచి లాక్‌చేసి ఉన్నాయి.
'ఏ మాటకామాటే చెప్పుకోవాలి సార్. రమ్య ఎంత అందంగా ఉంటుంది. ఆ అందం, పర్సనాలిటీ అబ్బాబ్బా... దోరమగ్గిన జాంపండులా ఉంటుంది'.
'నువ్వన్నది నిజమే, నేను ఆఫీస్‌కెళ్లే సమయం, రమ్య ఆఫీసుకెళ్లే సమయం ఇంచుమించూ ఒకటే కదా! కింద సెల్లార్ దగ్గర కలిసినప్పుడు నాకామె కళ్లలో కోరిక స్పష్టంగా కనిపించేది బాసూ. చట్... అర్థం చేసుకోలేక మంచి ఛాన్స్ పాడుచేసుకున్నా' రసికాగ్రేసుని విలాపం.
మొదటి అంతస్థులో ఒక మూల రెండు కుర్చీలు దగ్గరగా వేసుకొని... 'అక్కా, ఆ మాలతి ఒక పిల్ల తల్లయినా ఆ వయ్యారాలు తగ్గలేదు. ఎప్పుడైనా ఎదురుపడితే ''నమస్కారం ఆంటీ'' అంటూ మెలికలు తిరిగిపోయేది. నాకు ఒళ్లు మండిపోయేది అనుకో'.
'మొగుడు సంపాదిస్తున్నాడు, ఇంట్లో కూర్చొని తిని కొవ్వు పెంచిందిలే. అందుకే ఆ వయ్యారాలు, సోకులు'.
ఆ అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌లో 'అన్నా.. కొంపదీసి వాళ్లిద్దరి మొగుళ్లు తేడాగాళ్లా?'
'అంతే అయ్యుంటుంది. కానీ ఇద్దరికిద్దరూ సూపర్ ఫిగర్స్. అదే నేనయితేనా..' పగటికలల చక్రవర్తి నోటి చివరనుంచి చపల చిత్త రసప్రవాహం.
'అంతేనా, కొంపదీసి వీళ్లిద్దరూ మాంచి గట్టి మగాడ్ని చూసి, జెండా ఎత్తేసారా...' కన్నుకొట్టాడు షోకిళ్లా రాయుడు.
తలుపు మూసివున్నా. బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహిస్తున్న భార్గవ్ పిచ్చెక్కిపోతున్నాడు.
'మాలతి ఎంత అమాయకంగా ఉండేది. ఎదురింటి రమ్యతో స్నేహంగా ఉంటే పోనీలే అనుకున్నాను. కానీ, వీళ్లిద్దరూ కలిసి పరువు తీసేశారు. డర్టీ బిచ్. ఇప్పుడు ఎలా తలెత్తుకొని బయటకు వెళ్లాలి? ఒకట్రెండు రోజులైతే ఇంట్లో ఉండగలను. కానీ ఆ తరువాత అయినా బయట అడుగుపెట్టక తప్పదు. ఆ దొంగముండ మాలతి చేసినపనికి ప్రతి వెధవా అడిగే చెత్త ప్రశ్నలకు జవాబివ్వక తప్పదు'.
ఎదురు ఫ్లాట్‌లోనూ ఇదే కథ.
'ఇంజినీరింగ్ తర్వాత ఎం.బి.ఏ చేసింది. పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తుందని గొప్ప పొగరు రమ్యకు. షాపింగ్‌కి వెళ్లిన ప్రతిసారీ ఎదురింటి మాలతీని తీసుకొని వెళ్తుంటే, హమ్మయ్య షాపింగ్‌కి వెళ్లే బాధ తప్పింది అనుకున్నాను. కానీ ఇలా చేస్తారని ఊహించలేకపోయాను. దొంగముండ.. రేపు అమ్మానాన్నల దగ్గర, బంధువుల దగ్గర ముఖం ఎలా చూపించాలి?' లోలోపల రగిలిపోతున్నాడు కుమార్.
అపార్ట్‌మెంట్ అందరికీ అర్థం కానిది ఒక్క విషయమే.. వెళ్లిపోయినవారు ఇద్దరు మాత్రమే వెళ్లిపోకుండా వారిద్దరి పిల్లలనూ తీసుకొని వెళ్లిపోవడం ఏమిటా అని?
బ బ బ
నాకయితే చాలా చిత్రంగా అనిపించింది. నాకు తెలిసినంతలో ఇద్దరూ చాలా మంచివాళ్లు. అప్పుడప్పుడు నా శ్రీమతితో మాట్లాడటానికి మా ఫ్లాట్‌కి వస్తుంటారు. మర్యాద, మన్నన తెలిసినవాళ్లు. వారిద్దరూ ఇలా చేశారంటే నమ్మలేకపోతున్నాను. ఇదే విషయం నా శ్రీమతితో అన్నాను.
'అవునండీ నాకూ అలానే ఉంది. రమ్య చక్కగా మంచి జాబ్ చేస్తుంది. అందమైన చిన్న కొడుకున్నాడు. ఆమె భర్త కుమార్ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు. మాలతి చదువుకున్నా జాబ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి, తన పాపను చూసుకుంటూ అందరితో మంచిగా ఉండేది కదా! మరెందుకిలా చేశారో?' కాస్త ఆవేదనగా అంది.
'బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు, పిదప కాలం పిదప బుద్ధులు అని. ఇంకా ఎంతమంది ఉన్నారో మన అపార్ట్‌మెంట్‌లో ఆ ముదనష్టపు సంత' మా మాటలు వింటున్న మా అమ్మగారి తిట్లు. ఒక పదిరోజులు వరకూ మా అపార్ట్‌మెంట్, కాలనీ అంతా ఇదే హాట్ టాపిక్. వార్తాహరులు పనిమనుషులు మసాలాలు నూరడంలో నేర్పరితనం సంపాదించారు. రమ్య తన కంపెనీకి రాజీనామా చేసిందని తర్వాత తెలిసింది. ఇప్పుడు వారిద్దరూ ఎక్కడ ఉన్నారో తెలియదు. పరువు పోతుందని ఇరు కుటుంబాలూ పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదట. కాలం పరుగులతో కొన్ని విషయాలను, మనుషులను మరుపుకు తెస్తుంది.
బ బ బ
కంపెనీ పనిమీద బెంగళూరు వచ్చిన నేను, ఆరోజు ఆదివారం కావడంతో ఊరు చూద్దామని బయల్దేరాను. షాపింగ్‌మాల్లో విండో షాపింగ్ చేస్తున్నాను. అంత పెద్ద షాపింగ్‌మాల్ లోపల అడుగుపెడితే అన్నీ చూసి రావడానికి నాలుగైదు గంటలు సులభంగా పడతాయి. కాలక్షేపానికి ఇంతకు మించిన స్థలం ఉండదేమో. అన్నింటినీ చూస్తూ ఓపెన్ రెస్టారెంట్‌లో ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని కూల్‌డ్రింక్ తాగుతున్నాను. చాలా ముద్దుగా ఉన్న ఒక ఆరేళ్ల పాప, బాబు పరిగెడుతూ ఆడుకుంటున్నారు. వారి వెనుకనే 'డోంట్ రన్ బేబీ' అంటూ సున్నితంగా మందలిస్తూ చక్కని మేని ఛాయా, అంగ సౌష్టవంతో బ్లూ జీన్స్‌పై క్రీమ్ కలర్ టాప్ వేసుకొని, కాళ్లకు షూతో ఓ జవ్వని వారిని అందుకోడానికి వేగంగా నడవసాగింది. ఆ పిల్లలు ఆమెకు దొరకకుండా రెస్టారెంట్ అంతటా కిలకిల నవ్వుతూ పరుగులు తీస్తున్నారు. అక్కడ కూర్చున్న అందరూ ఆ పసిపిల్లల ఆటను చూస్తూ ఆనందిస్తున్నారు. ఆమెకు చిక్కకుండా తిన్నగా వచ్చి నా టేబుల్ వెనుక దాక్కున్నారు. నవ్వుతూ నేను వారిని గమనించసాగాను. చాలా ముద్దుగా ఉన్నారిద్దరూ.
ఇంతలో ఆమె నా టేబుల్ దగ్గరకు వచ్చి వారిని పట్టుకొని, దగ్గరకు తీసుకొని హత్తుకుంది. ఆమె చర్యలను గమనిస్తున్న నేను ఉలిక్కిపడుతూ మరోసారి తేరిపారా చూశాను. సందేహం లేదు తను మాలతీలానే ఉంది. సుమారు నాలుగు సంవత్సరాలైంది చూసి.. కానీ పోలికలు మాలతి అనే చెప్తున్నాయి. ఇంతలో ఆమె కూడా నన్ను చూసి, ముఖంలో రంగులు మారుతుండగా పిల్లలను తీసుకొని దూరంగా వెళ్లసాగింది. సందేహం వదలని నేను లేచి ''మాలతీ'' అని పిలిచాను. ఒక్క క్షణం ఆగినట్లే ఆగి, మరలా నడవసాగింది ఆమె. కానీ కుతూహలం నన్ను ముందుకు నడిపించింది. గబగబా వెళ్లి ఆమె ఎదురుగా నిలబడ్డాను. చిత్తరువు ఆయిపోయిందామె.
'మాలా! అన్నీ ప్యాక్ చేయించాను, పద వెళ్దాం' అంటూ అక్కడకి వచ్చినామే రమ్య అని తేలికగానే గుర్తుపట్టాను. నన్ను గుర్తుపట్టిన రమ్య కూడా ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది.
'అమ్మా రమ్యా బాగున్నారా?' పలకరించాను.
తల ఊపుతూ 'మీరు.. ఇక్కడా..?' అంటూ చుట్టూ చూడసాగింది.
'నేనొక్కడినే ఆఫీస్ పనిపై ఈ ఊరు వచ్చాను. ఆదివారం అని ఇలా కాలక్షేపం చేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఎక్కడ ఉంటున్నారు? మీ పిల్లలే కదా వీళ్లు?' ప్రశ్నల వర్షం నాకు తెలియకుండానే.
'అన్నీ చెప్తాను, దగ్గరలోనే మా ఇల్లు రండి' అంటూ బయటకు నడుస్తున్న వారితో నేను కూడా నడిచాను. ఆటోలో వారితో కూర్చున్నా, నా ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. అందరూ అనుకున్నట్లే ఇద్దరూ అలా కలిసే ఉంటున్నారా? చూస్తుంటే అదే అనిపిస్తుంది. రమ్య, మాలతి ఇద్దరూ మంచి రంగు వచ్చి, ముఖాలు కొత్త కాంతితో వెలిగిపోతున్నాయి. ఛీ, ఛీ... ఇప్పుడు వారు పిలవగానే వారింటికి వెళ్లడం అంతబాగా లేదు. నా ఆలోచనలతో ఎప్పుడు వారి గేటెడ్ కమ్యూనిటీ ముందు ఆటో ఆగిందో గమనించలేదు. చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీలా ఉంది. ప్రతి అపార్ట్‌మెంట్‌కీ ఓ ఇరవై వరకూ అంతస్తులున్నట్లు ఉన్నాయి. అలాంటి బ్లాక్స్ ఓ పది వరకూ ఉన్నాయి. పార్కులు, చెట్లతో చాలా బాగుంది. ఇలాంటి దగ్గర ఎవరి దారి వారిదే. పక్కవాళ్ల గురించి పట్టించుకునే తీరిక, ఆసక్తి ఎవరికుంటాయి? బహుశా అందుకేనేమో వీళ్లిద్దరూ ఇక్కడ చేరారు.. మనసులో ఆలోచనలు ఎగరసాగాయి.
'ఇదే అంకుల్ మా ప్లాట్, రండి' తాళం తీస్తూ పిలిచింది మాలతి. మెయిన్ డోర్ పక్కన కారిడార్‌లో గుమ్మానికి అటూ ఇటూ రెండు పూలమొక్కలు. రెండు పడక గదులతో, విశాలమైన హాలు, కిచెన్, డైనింగ్ రూమ్ చాలా బాగుంది. హాల్లో సోఫాలో కూర్చుని, ఇల్లంతా పరిశీలించాను. గోడలకు అందమైన పెయింటింగ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. కార్నర్ స్టాండ్స్‌పై పేరుతెలియని ఇండోర్ ప్లాంట్స్‌తో చాలా నీటుగా ఉందా ఇల్లు. వాళ్ల అభిరుచికి మెచ్చుకోలేకుండా ఉండలేక పోయాను. ఇల్లు చూసే మిషతో ఫ్లాట్ మొత్తాన్ని కళ్లతో స్కాన్ చేసిన నాకు ఎక్కడా మగ వాసన ఆనవాళ్లు కనబడలేదు. నా అనుమానం బలపడసాగింది.
'అంకుల్ మీరు రమ్యతో మాట్లాడుతూ ఉండండి. నేను పిల్లలకు అన్నం తినిపించి వస్తాను' అంటూ మాలతి పిల్లల్ని తీసుకొని డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లింది. 'అంకుల్ కాఫీ?' అడుగుతున్న రమ్యతో 'ఏం వద్దులేమ్మా, అలా కూర్చో' అన్నాను అసలు విషయం తెలుసుకోవాలని మనసు తొందర పెడుతోంది. 'నాకు తెలుసు అంకుల్, మీరేం అడుగుతారో?' నా కళ్లలోనికి చూస్తూ రమ్య అన్న మాటలకు విస్తుపోయాను. తప్పు చేసి, తిరిగి కళ్లలో కళ్లుపెట్టి మరీ ఇంత ధైర్యంగా మాట్లాడుతుందని అనుకోలేదు. 'అంకుల్! మీరన్నా, ఆంటీగారన్నా మాకు ఎంతో గౌరవం. మన అపార్ట్‌మెంట్‌లో మనసుతో ఆలోచించే వ్యక్తులు మీరే. మేము చేసినపని మీ అందరి దృష్టిలో చాలా నేరం, ఘోరం కూడా. అంతేకదా అంకుల్'.
చేసిన తప్పును ఎలా సమర్థించుకుంటుందా? అని ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాను.
'భూమి తనచుట్టూ తాను తిరుగుతున్నట్లే ఈ సమాజం కూడా పరిమిత నియమాల చుట్టూ తిరుగుతూ ఉంది. కట్టుబాట్లతో తనను తాను కట్టివేసుకుంది. ప్రశ్నించే నోరును కుట్టేస్తుంది. మా ఇద్దరి భర్తల వల్ల మేమెంత నరక వేదన అనుభవించామో? ప్రతిరోజూ మనసును, తనువు కాల్చే హింసా పశుత్వానికి ఎలా బలయ్యేవారమో మీకెవ్వరికీ తెలియదు' రమ్య కళ్లలో సుడిగుండాలు తిరుగుతున్నాయి. గతకాలపు బాధలు అడ్డుపడి కాబోలు గొంతు బొంగురుపోయింది.
'నా భర్త కుమార్ రియల్ ఎస్టేట్ అంటూ తిరుగుతూ కొత్త కొత్త స్నేహితులను, వ్యసనాలను పరిచయం చేసుకొని, వ్యాపారంలో నష్టాలు రావడంతో నా ఒంటిమీద ఉన్న బంగారం కూడా తీసి, ఖర్చుపెట్టేశాడు. బంగారం కంటే భర్త సుఖమే ముఖ్యం అనుకున్నాను. కానీ ప్రతిరోజూ తాగొచ్చి, గొడ్డును బాదినట్లు ఒళ్లు హూనం చేసేవాడు'.
అప్పట్లో నవ్వుతూ కనిపించిన రమ్య పెదాల వెనుక ఇంత బాధ ఉండేదా? ''అయ్యో'' అనిపించింది.
'ఆ మధ్య కొత్తగా సినీ నిర్మాత అంటూ ఒకతన్ని ఇంటికి తీసుకొచ్చి, ఇంట్లోనే మందు పార్టీలు ఇచ్చేవాడు. ఆ నిర్మాత దగ్గర బాగా డబ్బులున్నాయి, కాస్త క్లోజ్‌గా ఉండంటూ ఏ భర్తా తన భార్యతో అనని మాటలు చెప్పేవాడు. ఒకరోజు రాత్రి వాళ్లిద్దరూ బాగా తాగి.. ఆ వెధవ నన్ను పెట్టి ఒక బ్లూ ఫిల్మ్ తీసి, విదేశాల్లో అమ్మితే లక్షలకు లక్షలు వస్తాయని చెత్త వాగుడు వాగాడు. నా భర్త ఆ రాస్కెల్‌ని లాగి రెండు కొట్టకుండా ''శభాష్ గురూ, అప్పులన్నీ ఒడ్డెక్కిపోయే మార్గం చెప్పావు'' అంటూ లేచి కౌగిలించుకున్నాడు. ఆ నీచుడు చూసే ఆకలి చూపులు నా శరీరాన్ని ముక్కలు చేసేవి'.
ఇంతలో పిల్లలకు భోజనాలు పెట్టి, పడుకోబెట్టి వచ్చిన మాలతి మాతో కూర్చొని, తన గుండెలోని వేదనను ప్రవహింపజేసింది. 'అంకుల్, నా పరిస్థితీ ఇంచుమించు ఇలాంటిదే. డబ్బులు అవసరమైన ప్రతిసారీ నా ఒంటిపై బెల్ట్ నాట్యం చేసేది. పుట్టింటికి వెళ్లి, డబ్బులు తెస్తాను అనేవరకూ కొడుతూనే ఉండేవాడు నా భర్త భార్గవ్. అటు చూస్తే మా నాన్నగారు రిటైర్ అయ్యి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను వెళ్లిన ప్రతిసారీ ఎక్కడో దగ్గర అప్పుచేసి డబ్బులు తెచ్చిచ్చేవారు. భార్గవ్ కాంట్రాక్టర్ అని మీకు తెలుసు కదా! పెద్ద ప్రాజెక్ట్ ఉంది. అది చేస్తే కనీసం కోటి రూపాయలైనా లాభం వస్తుంది. కొద్దిరోజుల్లో విజిట్‌కు వస్తున్న ఆ ప్రభుత్వాధికారి గెస్ట్‌హౌస్‌కు ఆ ఫైల్ పట్టుకొని వెళ్లాలని, వెళ్లనంటే మా పుట్టింటికి వెళ్లి, నాన్నగారి ఇల్లమ్మి డబ్బులు తెమ్మని, లేకపోతే విడాకులు ఇచ్చేస్తానని బూతులు తిడుతూ కొట్టేవాడు. మేమిద్దరం మా పరిస్థితిని ఒకరికొకరం చెప్పుకుంటూ కుమిలిపోయేవారం. ఇద్దరిదీ ఒకే కథ. దురహంకార భర్తల పాదాల కింద మేమూ, మాతో పాటు పిల్లలూ నలిగిపోతున్నవారమే. అప్పుడే మేమిద్దరం అనుకున్నాం. జీవితాంతం నరకం అనుభవించేకంటే మరణమే శరణ్యం అని. కానీ, మేము చనిపోతే మా పిల్లలు దిక్కులేని వారైపోతారు. ముద్దులు మూటగట్టే చిన్నారులను ఆ వెధవలు చూస్తారనే ఆశలేదు' అన్నారిద్దరూ.
బాధగా వారిద్దరి వైపూ చూశాను. పాపం చిన్న వయసులోనే ఇన్ని కష్టాలా? జీవితాంతం రక్షణ ఇవ్వాల్సినవారే భక్షకులయ్యారా? అయ్యో.. నా జాలిచూపులు గ్రహించిగాబోలు..
'ప్రతిరోజూ నరకం అనుభవించే బదులు దూరంగా వెళ్లిపోయి, మేము అనుకుంటున్న జీవితం గడుపుతూ, పిల్లలను తీర్చదిద్దాలని అనుకున్నాం. అందుకే ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడ ఉద్యోగానికి అప్లై చేసి, సెలెక్ట్ అయిన తర్వాత మన ఊర్లో నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాను. పిల్లల్ని తీసుకొని ఈ ఊరు వచ్చాము. నేను ఉద్యోగం చేసి సంపాదిస్తే, మాలతి పిల్లల ఆలనా పాలన చూస్తూ, వారి చదువుల పట్ల శ్రద్ధ వహిస్తుంది' చిరునవ్వుతో చెప్పింది రమ్య.
'నాకు పెయింటింగ్స్ వెయ్యడం అంటే చాలా ప్రాణం. పెళ్లయిన తర్వాత బ్రష్ పట్టుకొంటే భార్గవ్ వెక్కిరించేవాడు. ఇప్పుడు రమ్య ప్రోత్సాహంతో పురివిప్పిన నెమలిలా స్వేచ్ఛగా నేను మరలా పెయింటింగ్స్ వెయ్యడం ప్రారంభించాను' అంటున్న మాలతి కళ్లలో మెరుపు.
'మీకు తెలుసా అంకుల్, చిత్ర అనే పేరుతో మాలతి వేస్తున్న పెయింటింగ్స్‌కి ఆన్లైన్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇంట్లో కూర్చోనే తను నీతిగా, నిజాయితీగా సంపాదిస్తుంది' లేచి మాలతి పక్కన కూర్చుంటూ ఉత్సాహంగా చెప్పింది రమ్య. అయితే ఈ గోడలకున్న పెయింటింగ్స్ నువ్వు వేసినవేనా తల్లి? మురిసిపోతూ అడిగాను. నవ్వుతూ తల ఊపింది మాలతి. ''కానీ...అయితే...'' నా మనసులోని సందేహాన్ని ఎలా అడిగాలో తెలియక సంశయించాను.
'నాకర్థమయ్యింది మీ సందేహం. మేమిద్దరం ఒకరికొకరం ఇష్టపడి లేచిపోయామేమో అని మీ సందేహం. మేము మీరందరూ అనుకున్నట్లు ఆ టైప్ కాదు. అలాంటి ఆలోచనలూ మాకు లేవు. సొంత అక్కాచెళ్లెలా ఉన్నాము. ఒక తల్లికి పుట్టకపోయినా అంతకంటే ఎక్కువగా ప్రేమాభిమానాలతో ఉన్నాము. ఏం అంకుల్ ఇప్పుడు చెప్పండి! మీ అనుమానం తీరిందా?' రమ్య మాటలకు సిగ్గుపడ్డాను.
అందరితో పాటు నేనూ అపార్థం చేసుకున్నందుకు వారిముందు దోషిలా నిలబడ్డాను. 'మరి.. ఎంతకాలం మగతోడు లేకుండా...' అర్ధోక్తిగా ఆగాను.
'మొన్నటి వరకూ అనుభవించిన బాధలు చాలు. శారీరక అవసరాలు మమ్మల్ని ఇబ్బందిపెట్టే దశను ఎప్పుడో దాటేశాము. మాకు జీవితంలో మగతోడు అవసరం లేకుండా బ్రతకగలం. మా పిల్లలను చక్కగా చదివించి, ఉన్నత వ్యక్తిత్వ విలువలతో ఆదర్శ పౌరులుగా తయారుచేస్తాము' అని ఆవేశంగా అంటున్న మాలతి ముక్కుపుటలు అదిరిపోసాగాయి.
'అంకుల్ తన మాటల వెనుక ఉన్న బాధను అర్థం చేసుకోండి. మా పాత జీవితంలోని వ్యక్తులెవరికీ కనబడకూడదు అనుకొని దూరంగా వచ్చేశాము. కానీ, అనుకోకుండా మీరు ఎదురయ్యారు. మా విషయం..' అంటూ చేతులు జోడిస్తున్న రమ్య తలపై చెయ్యివేస్తూ.. 'మీరిద్దరూ నిశ్చింతగా ఉండండి. నా ప్రాణం పోయేవరకూ మీ విషయం నేనెక్కడా మాట్లాడను. మీ ఆంటీ దగ్గర కూడా. ఎంత వేదన పడకపోతే మీరు గడపదాటి, ఇలా బయటకు వస్తారమ్మా! నాకు అర్థమయ్యింది. కట్టుబాట్లను కూలదోసినందుకు లోకనిందకూ భయపడకుండా ధైర్యంగా నిలబడిన మిమ్మల్ని చూస్తుంటే సెల్యూట్ చేయ్యాలనిపిస్తుంది. మీకు ఏ సహాయం అవసరమైనా నాకు కాల్ చెయ్యండి' నా మొబైల్ నెంబర్ ఇచ్చి బయటకు వస్తూ...
'అమ్మా మాలతి, నీ పెయింటింగ్స్‌ని ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటా. పదిమందితో కొనిపిస్తా. సరేనా! ఏమైనా మీరు చాలా పెద్ద సాహసం చేశారమ్మా. విజయీభవ' నవ్వుతూ అన్నాను. ఆ ఇంటి గుమ్మం ముందు ఆత్మవిశ్వాసంతో విరిసి, చిరునవ్వులు చిందిస్తూ సరికొత్త రాగం ఆలపిస్తున్న జంట పూలను చూస్తూ తృప్తిగా ముందుకు నడిచాను.
- జి.వి.శ్రీనివాస్
77024 55559