నాలో ఇంతకుముందు ఎరగని
ఏదో అలజడి-
నా దేహంలో చిట్టచివరి శ్వాసనూ
నువ్వే దోచుకుపోతున్నట్టు,
నా రంగు, రూపు మార్చలేక
సతమతమవుతూ కూడా
నీవు విర్రవీగుతున్నట్టు.
అప్పుడే అనుకున్నాను
నిన్నటి నీ చిరునవ్వులో
విరగబూసిన జిల్లేడుపాల పరిమళం
నీ కరస్పర్శలో, నీ ఉఛ్వాస నిశ్వాసల్లో
ఏవో తెలియని ప్రకంపనలు..
నీ అసహనపు ఛాయలు
చూచాయగా గుర్తించాను-
నా దేశ దేహపు నడిబొడ్డున
బుద్ధిజీవులు ప్రతిష్టించినది
మాట్లాడలేని ఒక శిలా విగ్రహం
అనుకుంటే అది నీ పొరపాటు..
అది విశ్వవ్యాప్తమైన నా చూపుడువేలు
ఆ చూపుడు వేల్లోంచి ఒక జీవననాదం
మేధోదీపపు వెలుగురేకై జాతికి రక్షణ ఇస్తుంటే
నీ అక్కసు ఎందుకో ఎంతకీ అర్థంకాదు!
వేయితలలుగా విస్తరించిన అహంకారమా!
నిన్ను తెలివిలేమి నుండి
బయట పడేయాలనే తపనతో వున్నాను
నేను నడిచినదారుల్లో పులకించిన మట్టిని
పొద్దున్నే లేచి కళ్లకద్దుకో!
జ్ఞానోదయానికి చేరువలో వుంటావ్.
నా గుర్తుల్ని చెరిపేద్దామనుకుంటే
నా నీడలో నిలువెత్తు ఎదిగిన
నా నీలి గొంతుకలు నిప్పులు చిమ్ముకుంటూ
దుఃఖాన్ని నటించే పాదాలకు
రక్త నాళాల్ని బహూకరించి
నడకలు నేర్పడానికి సిద్ధమవుతున్నాయి..
నిద్ర కరువైన నిశి రాత్రులను,
విలువలు లేని విషాద ఉషోదయాలను
భారంగా మోస్తూ కునికిపాట్లు పడుతున్న కులోన్మాదులారా!
తడి కోల్పోయిన మీ మెదడుకు
తేనెపాకం తినిపిస్తా
సరిహద్దుల్ని చేరిపేసి
తూరుపువాకిలి తెరిచే ఉంచా
స్నేహ హస్తం విస్తరించా
ఆలోచించండి!
ఆత్మ విమర్శ చేసుకోండి!!
అసలు కక్షిదారుడెవరో తేల్చుకోండి!!!
మీ కోసం, మీలాంటి వాళ్లకోసం
నేనిప్పుడు సరికొత్త ప్రవేశిక రాస్తున్నాను.
- విల్సన్‌రావు కొమ్మవరపు
89854 35515