
'శ్రీవారి'ప్రసాదాల తయారీలో
వివక్ష వద్దు : సిఐటియు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
తిరుమల ప్రసాదాల తయారీలో కుల వివక్ష పాటించటం న్యాయం కాదని, తక్షణం టిటిడి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తిరుమల ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందని, తిరుమలలోని పోటులో ప్రసాదాల తయారీకి కేవలం వైష్ణవ బ్రాహ్మణులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ యాజమాన్యం తరపున నోటిఫికేషన్ ఇవ్వడం అభ్యంతరకరమని, తక్షణం దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమతా మూర్తి రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతంతో తిరుమల ఆలయ వ్యవస్థను నడిపారని, కులాలకు అతీతంగా వ్యవహరించిన తీరుకు భిన్నంగా నేడు టిటిడి ఫలానా కులం వారే ప్రసాదాలు తయారుచేయాలని నోటిఫికేషన్ ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. గతంలో ఇఓగా పనిచేసిన ఐవైఆర్ కష్ణారావు ఈ రకమైన నోటిఫికేషన్ విడుదలకు కారకులై ఆ సందర్భంగా తీవ్ర వివాదం వ్యక్తమైన విషయాన్ని గుర్తు చేశారు. తిరిగి ఆ వివాదాన్ని కొనసాగించే ధోరణిలో టిటిడి యాజమాన్యం వ్యవహరించడం అభ్యంతరకరమని అన్నారు. ఐవైఆర్ కష్ణారావు ఇఓగా రాక పూర్వం ప్రసాదాల తయారీలో శైవ, వైష్ణవ ప్రస్తావనలు రాలేదని గుర్తు చేశారు. వైష్ణవ బ్రాహ్మణులు పోటులో ప్రసాదాలు తయారుచేస్తే వాటిని ఇతర బ్రాహ్మణులు పోటు నుంచి బయటకు తరలిస్తారని, ఆలయ గేట్లు నుంచి వాహనాల వరకు బరువైన ప్రసాదాల ట్రేలను దళితులు మోస్తారని తెలిపారు. ప్రసాదాలను మోయటానికి లేని వివక్ష తయారీకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. టిటిడి యాజమాన్యం ఈ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కందారపు మురళి (ఫైల్‌ఫొటో)