Sep 17,2023 22:23

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు
శాస్త్రోక్తంగా అంకురార్పణ

ప్రజాశక్తి- తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మౌత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
అంకురార్పణ క్రమం..
విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈపాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈకార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈఓ వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్‌, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం, ఇతర అధికారులు పాల్గొన్నారు.