శ్రీశ్రీ రచనలు శ్రామిక పక్షం
ప్రజాశక్తి - నంద్యాల
శ్రామిక పక్షాన నిలిచి శ్రమ విలువను వివరిస్తూ శ్రీరంగం శ్రీనివాసరావు తన రచనలు సాగించిన మహాకవి అని సాహితీవేత్త కళామురళి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక భగత్ సింగ్ లైబ్రరీలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెడ్‌బుక్ దినోత్సవం సందర్బంగా శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కవితా సంపుటి పఠన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామజిక వేత్త, సీనియర్ అడ్వకేట్ బి.శంకరయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా శ్రీశ్రీ చిత్రపటానికి సాహితీవేత్త కళామురళి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సాహితీ స్రవంతి జిల్లా నాయకులు మాదాల శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీశ్రీ అంటే విప్లవమని, సమాజ మార్పు కోసం, రుగ్మతలను ఎత్తి చూపుతూ మార్పు కోసం ఉద్యమించాలని చాటి చెప్పారని అన్నారు. సమాజాన్ని దోపిడీ చేసే వర్గం, దోపిడీకి గురయ్యే వర్గంగా విభజించి శ్రమదోపిడిని వివరించారని తెలిపారు. బి.శంకరయ్య మాట్లాడుతూ సమాజంలోని కుళ్ళును కళ్ళకు కట్టినట్లు శ్రీశ్రీ తన రచనల ద్వారా వివరించారన్నారు. శ్రమకు పెద్ద పీట వేసి శ్రామిక విలువను వివరించారని చెప్పారు. దోపిడీ లేని సమాజం కావాలని కోరుకుంటూ అందుకు తిరుగుబాటు చేయాలని తన రచనల ద్వారా ప్రభోదించారని తెలిపారు. శ్రీశ్రీ రచనలు యువతకు ఆదర్శనీయం, అనుసరనీయ మన్నారు. నేటి రచయితలు శ్రీశ్రీని ఆదర్శంగా తీసుకొని సామాజిక మార్పునకు రచనలు సాగించాలన్నారు. ఈ సందర్బంగా 20 మంది మహాప్రస్థానంలోని కవితలు చదివి వినిపించారు. శ్రీశ్రీ రాసిన అభ్యుదయ పాటలను ప్రజాగాయకులు చిన్న బాలహుసేని, రమణ, వీరసేన పాడి వినిపించారు. కార్యక్రమంలో అభ్యుదయవాదులు రామరాజు, మాధవరావు, సురేష్, రామమూర్తి, నాగలింగం, సుబ్బయ్య, వెంకట రెడ్డి, కదిరప్ప, రిటైర్డ్ ఎస్‌ఐ ఎల్లా సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.










