శ్రీసిటీలో 'పోష్' చట్టంపై అవగాహన సదస్సు
ప్రజాశక్తి- వరదయ్యపాలెం
పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణ చట్టం అవగాహన సదస్సు శుక్రవారం శ్రీసిటీలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీసిటీ, మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ , కొన్రాడ్-అడెనౌర్-స్టిఫ్టుంగ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి, ఇందులో గుర్తింపు పొందిన పోష్ శిక్షకురాలు తిలగా పోర్చెల్వన్ స్పీకర్‌గా పాల్గొన్నారు.
శ్రీసిటీ హెచ్‌ఆర్ ఏజీఎం వి.శివకుమార్ సదస్సులో పాల్గొన్న వారికి సాదర స్వాగతం పలికి, వక్తలను పరిచయం చేశారు. చెన్నైకు చెందిన ఎంఎంఏ ప్రతినిధి ఆర్.సతీష్ కుమార్ ఈ సదస్సు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, కార్యక్రమానికి వచ్చిన వారంతా పోష్ గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు చురుకుగా పాల్గొనవలసిందిగా కోరారు.
తిలగా కార్యక్రమ ముఖ్యఅంశాలను చెబుతూ, 2013 పోష్ చట్టం ఆధారంగా విశాఖ వర్సెస్ రాజస్థాన్ ల్యాండ్‌మార్క్ తీర్పు ఫలితం ఎలా వచ్చిందో ఉదాహరణతో 'లైంగిక వేధింపు' అర్థాన్ని వివరించింది. వ్యక్తులు, సంస్థలపై లైంగిక వేధింపుల హానికర ప్రభావాన్ని వివరిస్తూ, సురక్షితమైన వాతావరణం యొక్క అవసరాన్ని ప్రస్తావించారు. పోష్ లో భాగమైన అంతర్గత ఫిర్యాదుల కమిటీల పాత్ర, ఫిర్యాదు దాఖలు విధానాలపై ఆమె చర్చించారు. కంపెనీలలో లైంగిక వేధింపులకు సంబంధించిన యదార్థ ఉదాహరణలను చెబుతూ, దానిని నిరోధించడంలో యాజమాన్యాల బాధ్యతలను గుర్తు చేశారు. అవగాహన పెంచుకోవడం, విధానాలను అమలు చేయడం, పటిష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంపై ఆమె సలహాలు, సూచనలు ఇచ్చారు. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు లేదా చూసినప్పుడు వారి హక్కులను కాపాడుకోవడంతో పాటు, తగిన రీతిలో ఎలా ప్రతిస్పందించాలో వివరించారు. ఇంకా పోోష్ చట్టంలోని కార్మికుల బాధ్యతలు, అర్హతలను ఈ సదస్సులో తెలియచేశారు.
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ, మహిళా వేధింపుల పట్ల అవగాహన, వేధింపుల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడంతో పాటు సురక్షితమైన సమ్మిళిత పని వాతావరణాన్ని సష్టించడంలో ఇటువంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై అవగాహన










