Feb 21,2023 21:12

అశ్వ వాహన సేవపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు

శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
- స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ
- వైభవంగా పుష్పోత్సవం, శయనోత్సవం
ప్రజాశక్తి - శ్రీశైలం

       మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు మంగళవారం జరిగిన అశ్వవాహన సేవతో ముగిశాయి. ఈ నెల 11న యాగశాల ప్రవేశం చేసి ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, వాహన సేవలు, రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల నుండి పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాల రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి అమ్మ వార్లకు కళ్యాణోత్సవం, మరుసటి రోజు రథోత్సవం, తెప్పోత్సవం, 11వ రోజు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాన్ని నిర్వహించారు. ఆ తర్వాత పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలు సంప్రదాయంగా నిర్వహించారు. భక్తుల కోసం శివ దీక్ష శిబిరాలలో, పుష్కరిణి వద్ద, కళావేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.