Oct 15,2023 19:59

ఉత్సవాలను ప్రారంభిస్తున్న చైర్మన్‌, ఇఒ దంపతులు

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ప్రారంభం
- శైలపుత్రి అలంకారంలో అమ్మవారు
- భృంగి వాహన సేవలో స్వామి అమ్మవార్లు
ప్రజాశక్తి - శ్రీశైలం

      శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు ఆదివారం సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ముందుగా శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ చక్రపాణి రెడ్డి దంపతులు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెద్దిరాజు దంపతులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు అమ్మవారి యాగశాలలో ప్రవేశం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులకు దీక్ష వస్త్రములు అందజేశారు. ఆ తరువాత స్వామివారి యాగశాలలో ప్రవేశం చేసి అర్చనలు నిర్వహించారు.
- శైలపుత్రి అలంకారంలో అమ్మవారు - భృంగి వాహన సేవలో స్వామి అమ్మవార్లు
శ్రీశైలంలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో నవదుర్గ అలంకరణలలో మొదటి రోజు ఆదివారం అలకార మండపంలో శైలపుత్రి అలంకారంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భృంగివాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శైలపుత్రి అలంకారంలో ఉన్న అమ్మవారిని, భృంగివాహనంపై ఉన్న స్వామి అమ్మవార్లను ఆలయ ప్రధాన ద్వారం గుండా పురవీధుల్లోకి ప్రవేశింపజేసి వివిధ రకాల నృత్య ప్రదర్శనలు, కళాకారుల కోలాటం, వేద మంత్రాల మధ్య గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా లోకకల్యాణం కోసం స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, అమ్మవారికి జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం వంటి పూజలు నిర్వహించారు.
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు : ఇఒ
దసరా పండగను పురస్కరించుకుని శ్రీశైలంలో జరుగుతున్న ఉత్సవాలలో సామాన్య భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు తెలిపారు. ఆదివారం ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నేటి నుండి 24వ తేది వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే దసరా నవరాత్రులలో స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. స్వామి అమ్మవార్లని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్థానిక పోలీసుల సహకారంతో ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పరిపాలన భవన సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు కేటాయించినట్లు చెప్పారు. క్యూ లైన్లలో భక్తులకు మంచి నీరు, అల్పాహారం, పాలు అందిస్తున్నట్లు తెలిపారు.