Sep 25,2023 21:28

నూతన ఇఒగా బాధ్యతలు స్వీకరిస్తున్న పెద్దిరాజు

శ్రీశైలం నూతన ఇఒగా పెద్దిరాజు బాధ్యతలు
ప్రజాశక్తి - శ్రీశైలం

    శ్రీశైలం దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా డి.పెద్దిరాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. పూర్వపు కార్యనిర్వహణాధికారి లవన్న వద్ద నుండి సాంప్రదాయబద్ధంగా నూతన ఇఒ బాధ్యతలు స్వీకరించారు. నూతన ఇఒ ముందుగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం పరిపాలన భవనంలోని ఇఒ కార్యాలయంలో బాధ్యతలను వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పెద్దిరాజు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇఒ మాట్లాడుతూ గతంలో తాను ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాలలో కార్యనిర్వహణ అధికారిగా విధులు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీశైలం దేవస్థాన ధర్మకర్తల మండలి ట్రస్టు సహకారంతో, దేవస్థానం సిబ్బంది ప్రోత్సాహంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు తమ వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
పూర్వపు ఇఒకు ఘనంగా వీడ్కోలు..
శ్రీశైల దేవస్థానం పూర్వపు కార్యనిర్వాహణాధికారి లవన్నకు ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఘనంగా సత్కరించారు. దేవస్థానం సిబ్బందితో కలిసి నూతన ఇఒ పెద్దిరాజు లవన్నకు వీడ్కోలు సభ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా లవన్న మాట్లాడుతూ దేవస్థానం సిబ్బంది, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు.