శ్రీశైలక్షేత్రంలో భక్తుల రద్దీ
ప్రజాశక్తి - శ్రీశైలం
శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకునేందుకు భక్తుల రద్దీ సోమవారం నాడు బాగా పెరిగింది. ఆదివారము, సోమవారము సెలవులు, ఇంటర్మీడియట్ ఫలితాలు రావడంతో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండి కాక పొరుగు రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు. దర్శించుకునేందుకు సుమారు రెండున్నర గంటల సమయం పడుతుందని భక్తులు తెలిపారు. భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకొని తెల్లవారుజామున ఐదు గంటలకి ఆలయ తలుపులు తెరిచి సుప్రభాత సేవ మహా మంగళ హారతి కార్యక్రమాలు అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. సోమవారం నుండి ఆన్లైన్ టికెట్లు ఉంచడంతో టికెట్లు కొన్న భక్తులు కూడా అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు.
ఆన్లైన్ ద్వారానే ఆర్జిత, స్పర్శ దర్శనం టికెట్లు
శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు, ఆర్జిత సేవలు నిర్వహించుకునేందుకు ఈనెల 1 తేదీ నుండి ఆన్లైన్ ద్వారా మాత్రమే జారీ చేయడం జరుగుతుందని ఇఒ లవన్న తెలిపారు. దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే పొందాలని సూచించారు. ఇందులో సోమవారం 1409 మంది స్పర్శ దర్శనం టికెట్లు, గర్భాలయం అభిషేకం టికెట్లు 111, సామూహిక అభిషేకాలు 490 టికెట్లు, తదితర టికెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నట్లుగా ఇఒ తెలిపారు. రూ.150 టికెట్లను ఆన్లైన్లో 30 శాతం, కరెంటు బుకింగ్ 70 శాతం టికెట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సామాన్య భక్తులకు మంగళ బుధ గురు శుక్రవారాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుండి 4:00 వరకు ఉచిత స్పర్శ దర్శనం యధావిధిగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆన్లైన్లో టికెట్ పొందిన వారు హార్డ్ కాపీని వెంట తీసుకురావాలని ఉదయం తెల్లవారుజామున 4:30 గంటలకు వారికి స్పర్శ దర్శనం కల్పించబడుతుంది అని తెలిపారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రతి టికెట్టు వెంట ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.










