
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : సత్య సాయి జిల్లాలోని మడకశిర హిందూపురం డివిజన్లలో ఉన్న శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, తాగునీటి వర్కర్ల యూనియన్ గౌరవాధ్యక్షులు జి. ఓబులు డిమాండ్ చేశారు. ఆ రెండు డివిజన్ల కార్మికులతో కలసి ఆయన కలెక్టరేట్ ముందు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిఆర్‌ఒకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు డివిజన్లలో దాదాపు ఎనిమిది లక్షల మంది ప్రజలకు తాగునీరు అందిస్తున్న కార్మికులకు వేతనాలలో కోత విధిస్తూ సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. 180 మంది కార్మికులు 543 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారన్నారు. అయితే అక్కడి కాంట్రాక్టర్ గోవర్ధన్ రెడ్డి, ఎల్‌కె. నాయుడు కార్మికుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. హిందూపురం, మడకశిర డివిజన్లలో కార్మికుల వేతనంలో రూ.3500 కోత విధిస్తున్నారన్నారు. 15 నెలల నుంచి రావలసిన పిఎఫ్ లో 2500 రూపాయలు కోత విధిస్తున్నారన్నారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ కోత పెట్టిన వేతనాలలో వచ్చిన ఆదాయాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రజా ప్రతినిధులు బినామీ పేర్లతో డ్రా చేసుకుని ఆ డబ్బులు పంచుకుంటున్నారని విమర్శించారు. గత 19 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. సమ్మె ఫలితంగా పలు గ్రామాలలో తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. స్థానిక అధికారులు తగు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయంపై గ్రామీణ నీటి సరఫరా పథకం ఎస్‌ఇ రషీద్ ఖాన్ ను ప్రశ్నించగా తాను ఏమి చేయలేనని తనకు అధికారాలు లేవని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కార్మికుల సమస్యలపై ఇక్కడి కలెక్టర్ న్యాయం చేస్తారన్న నమ్మకంతో ఇక్కడికి ఈ రెండు డివిజన్ల కార్మికులు వచ్చామని కలెక్టర్ స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు సుబ్బరాజు, కార్యదర్శి హనుమంతు, ఉపాధ్యక్షులు సోమశేఖర్, సంయుక్త కార్యదర్శి మురళి, పలువురు కార్మికులు పాల్గొన్నారు.