ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ కార్మికులను మోసం చేస్తున్న నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ చేస్తున్న అక్రమాలపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీకి సిఐటియు నాయకులు, కార్మికులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మడకశిర డివిజన్‌లో బోగస్ కార్మికులను పెట్టుకుని డబ్బులు దోసుకుంటున్న కాంట్రాక్టర్ ఎల్.కె.నాయుడు అసలైన కార్మికులకు వేతనంలో రూ.2,500 కోత విధిస్తున్నారన్నారు. దీన్ని నిలదీసిన యూనియన్ నాయకుడు సుబ్బరాజును పనిలోకి రావద్దనడం దుర్మార్గమన్నారు. అలాగే హిందూపురం డివిజన్ కార్మికులకు కాంట్రాక్టర్ గోవర్ధన్‌రెడ్డి 18 నెలల ఈపీఎఫ్ కట్టాలని తెలిపారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సత్యసాయి జిల్లా శ్రీరామిరెడ్డి వాటర్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు లక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా నాయకుడు ప్రభాకర్, మడకశిర డివిజన్ అధ్యక్షులు సుబ్బారాజు, హిందూపూరు కార్మికులు పాల్గొన్నారు.
విచారణ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు, కార్మికులు










