Aug 22,2023 00:11

సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు

శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి
'చలో పోలాక్షమ్మ'కు అఖిలపక్షం పిలుపు

ప్రజాశక్తి - పుత్తూరు , యంత్రాంగం (తిరుపతి జిల్లా)

దళితులు ఆలయంలోకి రావడానికి వీల్లేదని తాళం వేసిన శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని అఖిలపక్షం నేతలు డిమాండ్‌చేశారు. లేనిపక్షంలో వివక్షను సిఎం దృష్టికి తీసుకెళ్లి, చలో పోలాక్షమ్మ ఆలయం చేపడతామన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్‌, దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్‌పిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు డి.మహేష్‌ సంయుక్త ఆధ్వర్యంలో అంబేద్కర్‌ భవన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం సోమవారం జరిగింది. ఈనెల 22న మంగళవారం ఎస్‌పి, కలెక్టర్‌లను కలిసి వినతిపత్రి ఇస్తామని, గురువారం నిరసన దీక్ష చేపడతామని, 28న ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇస్తామని కార్యాచరణ రూపొందించారు. స్పందించకుంటే సెప్టెంబర్‌ 3వ తేదీ 'చలో రామకృష్ణాపురం పోలాక్షమ్మ గుడి' చేపడతామన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ దళితులు ఆలయానికి రాకూడదని ఆలయానికి తాళం వేసిన ఆలయ కమిటీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేసి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. ఆధునిక యుగంలోనూ అంటరానితనం ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉందన్నారు. బిహెచ్‌పిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామంలోని పోలాక్షమ్మ జాతర సందర్భంగా పొంగళ్లు సమర్పించేందుకు దళితులు ఆలయానికి వచ్చారనే కారణంతో ఆలయంలోకి వెళ్లనీకుండా ఆలయ పూజారి దళితులు లోనికి పోకుండా తాళం వేసి వెళ్లిపోయాడన్నారు. ఎంతకీ తాళం తీయకపోవడంతో పోలాక్షమ్మ అమ్మవారికి బయటే పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకుని వెళ్లారన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కేశవులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో దళితులకు ప్రత్యేక సంక్షేమ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశామన్నారు. జనసేన నియోజకవర్గ నాయకులు మెరుపుల మహేష్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు అవుతున్నా గ్రామాల్లో కులవివక్షలో మార్పు రాలేదన్నారు. రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి కప్పయ్య మాట్లాడుతూ దళితులను నీచంగా చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌పి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ధనంజయ, అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మహేష్‌, దళిత గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నందయ్య, రమేష్‌, గజపతి, మురగ, నాదముని, రవి, పరిమళ, మంజుల, విజరు పాల్గొన్నారు.
తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసనలు
కెవిబిపురంలో... సిపిఎం సత్యవేడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాసరి జనార్ధన్‌, మండల కార్యదర్శి నాగలాపురం నాగరాజు ఆధ్వర్యంలో తహశీల్దార్‌ శ్రీదేవికి వినతిపత్రం ఇచ్చారు. కులంపేరుతో దూషించి, వివక్ష చూపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దళిత నాయకులు మీరయ్య, శేఖర్‌, వెంకటమ్మ, శంకరయ్య పాల్గొన్నారు. బిఎన్‌ కండ్రిగలో... కెవిపిఎస్‌, వ్యకాసం ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తహశీల్దార్‌ భార్గవికి వినతిపత్రం ఇచ్చారు. నాయకులు ఎన్‌.రమణయ్య, సుబ్బయ్య, అంకయ్య, బాల గురవయ్య, ఏసుపాదం పాల్గొన్నారు. వెంకటగిరిలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ దళితులకు రక్షణ కల్పించాలని కోరారు. నాగలాపురంలో...మండల కార్యదర్శి మురగేషన్‌ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తహశీల్దార్‌ ప్రసన్నకుమార్‌కు వినతిపత్రం అందించారు. చిన్నమణి, బాలాజీ, సుబ్బయ్య, గౌసియా, పద్మ పాల్గొన్నారు.