May 13,2022 06:51

రుణం కోసం 'అంతర్జాతీయ ద్రవ్య నిధి' (ఐఎంఎఫ్‌)తో శ్రీలంక ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అంటే దీనివల్ల సంక్షేమంలో కోతలు, పొదుపు చర్యలు, మరింత ప్రైవేటీకరణ వుండొచ్చు. శ్రీలంకలోని ప్రధాన స్రవంతిలో గల రాజకీయ పార్టీలకు ఐఎంఎఫ్‌ ఆదేశాలను పాటించడం తప్ప మరో మార్గం లేదు. అయితే, తీవ్రమైన వ్యవస్థాగత సంక్షోభానికి ఇది పరిష్కారం కాదు. ప్రత్యామ్నాయ పంథాను రూపొందించాల్సిన అవసరం వుంది. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించగల, ఫెనాన్స్‌ పెట్టుబడుల దోపిడీ నుండి శ్రీలంకకు రక్షణ కవచంలా నిలవగల వ్యవస్థ రావాల్సి వుంది. రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించాల్సి వుందని స్పష్టం చేస్తూ, ఇటువంటి మార్పు కోసం పోరాడేందుకై ప్రజలను సమీకరించేందుకు శ్రీలంక లోని వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల ఎదుట ఇదొక అరుదైన అవకాశంగా వుంది.

    త కొన్ని నెలలుగా కనివినీ ఎరుగని రీతిలో శ్రీలంకను పట్టి పీడిస్తున్న తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దిగజారుతున్న పరిస్థితులకు మే 9న జరిగిన హింసాత్మక సంఘటనలు ఒక్కసారిగా సత్వర ఉపశమనాన్ని కలిగించాయి. ఆ ఆర్థిక సంక్షోభం ఇప్పుడు మొత్తంగా రాజకీయ వ్యవస్థను, సమాజాన్ని కమ్ముకుంది. రాజపక్స కుటుంబ పాలన ఈ సుడిగుండానికి కేంద్రంగా వుంది. అసలే ఒడిదుడుకులతో సాగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఒడ్డున పడేసే ప్రయత్నంలో, కార్యనిర్వహణ అధికారాలు కలిగిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పెద్ద సోదరుడు మహింద రాజపక్సను ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారు. అంతకుముందు, మొత్తంగా కేబినెట్‌ అంతా రాజీనామా చేసింది. మహింద రాజపక్స నేతృత్వాన కొత్త మంత్రివర్గం ఏర్పడింది.
     ఆర్థిక సంక్షోభానికి దారి తీసిన వినాశకర విధానాలు, నిర్ణయాలకు రాజపక్స ప్రభుత్వానిదే బాధ్యత. పన్నుల్లో కోత విధించడం, వ్యవసాయ వినియోగానికి అవసరమైన ఎరువుల దిగుమతులు నిలిపివేయడం, బృహత్తరమైన ప్రాజెక్టుల్లో బ్రహ్మాండమైన పెట్టుబడులు పెట్టడం వంటి నిర్ణయాలన్నింటినీ ఈ నిరంకుశ ప్రభుత్వమే తీసుకుంది. దీంతో ఆదాయాలు తగ్గిపోయాయి. వ్యవసాయ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఇది, అప్పటికే పెరుగుతున్న రుణ భారాన్ని మరింత పెంచింది. ఈలోగా తలెత్తిన కోవిడ్‌ మహమ్మారి అప్పటికే ముంచుకొస్తున్న సంక్షోభాన్ని మరింత ఉధృతం చేసేందుకు దోహదపడింది. పర్యాటకం దెబ్బతినడం, విదేశాల్లో పనిచేసే శ్రీలంక కార్మికులు పంపే చెల్లింపులు నిలిచిపోవడంతో వాటి ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యం తీవ్రంగా పడిపోయింది.
    ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటి నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, ఇంధనం, ఔషధాలు ఇలా అన్నిటికీ తీవ్రంగా కొరత ఏర్పడింది. అడ్డూ అదుపు లేకుండా ధరలు పెరుగుతునే వున్నాయి. దుర్భరమైన ఈ పరిస్థితులు, ప్రజలు తమ నిరసనలను, ఆందోళనలను తెలియచేయడానికి వీధుల్లోకొచ్చేలా చేశాయి. మార్చి 31 నుండి సెంట్రల్‌ కొలంబో లోని గాలె ఫేస్‌ గ్రీన్‌ వద్ద, ప్రధాని నివాసం వెలుపల ఆందోళనకారులు గుమిగూడి నిరసనలు తెలియచేయడం ఆరంభించారు. శాంతియుతంగా సాగిన ఈ ఆందోళనల్లో వేలాదిమంది పాల్గొన్నారు. టీచర్లు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఇలా అన్ని వర్గాల ప్రజల నుండి ఈ నిరసనలకు మద్దతు లభించింది.
     ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజా ఉద్యమంలో కార్మిక వర్గం కీలకమైన పాత్ర పోషించింది. కార్మిక సంఘాల సమన్వయ సంస్థ ఏప్రిల్‌ 28న జరిగిన సార్వత్రిక సమ్మెకు పిలుపివ్వగా లక్షలాదిమంది పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. మే 5న తిరిగి రెండోసారి ఒకరోజు సాధారణ సమ్మెకు, హర్తాళ్‌కు పిలుపిచ్చారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వృత్తి నిపుణులతో సహా అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షుడు, మొత్తంగా ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందేనని ఈ సమ్మెల్లో ముక్త కంఠంతో నినదించారు.
    ఈ క్రియాశీలమైన సమ్మె కార్యాచరణతో ఖంగు తిన్న అధ్యక్షుడు గొటబాయ వెంటనే అత్యవసర పరిస్థితి విధించారు. నెల రోజుల కాలంలోనే రెండుసార్లు ప్రకటించారు. కర్ఫ్యూను కూడా విధించారు. కానీ ఆందోళనకారులు దాన్ని పట్టించుకోలేదు. ఆ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మరీ తమ నిరసనలు తెలియచేశారు. దాంతో ఇక పాలన అనేది దాదాపుగా స్తంభించింది. శాంతియుతంగా పాలనా మార్పుకు అడ్డంకొట్టేలా, రాజపక్సల చిట్టచివరి ప్రయత్నంగా మే 9 నాటి హింస చెలరేగింది.
      ప్రశాంతంగా రాజీనామా చేసి, అక్కడ నుండి వెళ్ళిపోవడానికి బదులుగా మహింద రాజపక్స తన అధికార నివాసానికి తన పార్టీ (ఎస్‌ఎల్‌పిపి) మద్దతుదారులను పిలిపించారు. అక్కడ రాజపక్స రెచ్చగొట్టే రీతిలో ప్రసంగించారు. దాంతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి, ప్రధాని నివాసం వెలుపల శాంతియుతంగా ఆందోళన జరుపుతున్న వారిపై దాడికి దిగారు. వారి శిబిరాలను కూల్చివేశారు. గాలె ఫేస్‌ వద్ద వేసిన శిబిరాలపై కూడా వారు దాడులు కొనసాగించారు. ఆ దాడుల పట్ల నిర్ణయాత్మకంగా వ్యవహరించడంలో పోలీసులు విఫలం కావడంతో వందలాదిమంది గాయపడ్డారు.
    రాజధాని వెలుపల ప్రాంతాల నుండి బస్సుల్లో కొలంబో చేరుకున్న పాలక పార్టీ మద్దతుదారులు విచ్చలవిడిగా హింసకు పాల్పడ్డారు. దీంతో ప్రజల నుండి ప్రతీకార చర్యలు తలెత్తాయి. ప్రధాని నివాసమైన టెంపుల్‌ ట్రెస్‌ వెలుపల వేలాదిమంది ప్రజలు గుమిగూడి దాన్ని ముట్టడించడానికి చూశారు. ఎట్టకేలకు, అప్పటికే రాజీనామా చేసిన మహింద రాజపక్స, ఆయన కుటుంబం హెలికాప్టర్‌లో నావికా స్థావరానికి వెళ్ళి తలదాచుకున్నారు. ఇక ఆ తర్వాత రాజపక్సల పూర్వీకుల ఇళ్లు, మాజీ మంత్రులు, పాలక పార్టీ ఎంపీల ఇళ్లపై దాడులు కొనసాగాయి. చాలావాటిని దగ్ధం చేశారు. ఈలోగా, అధ్యక్షుడు గొటబాయ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలో లేదా అఖిల పక్ష ప్రభుత్వంలో చేరేది లేదంటూ ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జెబి అలయన్స్‌ ప్రకటించింది. అధ్యక్షుడు గొటబాయ కూడా రాజీనామా చేయాల్సిందేనని వారు డిమాండ్‌ చేశారు. తాజాగా ఎన్నికలు జరిగేవరకు తాత్కాలిక అధ్యక్షుడు, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వామపక్షం, జనతా విముక్తి పెరుమునా (జెవిపి) కోరుతున్నాయి.
     అధ్యక్షుడు గొటబాయకు అపారమైన కార్యనిర్వహణ అధికారాలు వున్నందున ఆయన వెంటనే అధికారం నుండి వైదొలగాలని చేస్తున్న డిమాండ్‌ న్యాయమైనదే. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి, నియంతృత్వంతో కూడిన జాతీయ భద్రతా ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానంగా జవాబుదారీ చేయాల్సింది అధ్యక్షుడినే. ఇప్పుడు ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు పరస్పరం ముడిపడి వున్నాయి.
    రాజపక్స ప్రభుత్వాన్ని గద్దె దింపిన వెంటనే దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో ప్రజాస్వామ్యయుతంగా పరివర్తన జరగాలి. కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని రద్దు చేయాలి. కేంద్రీకృత జాతీయ భద్రతా ప్రభుత్వ వ్యవస్థను కూలగొట్టాలి. నయా ఉదారవాద విధానాల చట్ర పరిధి స్థానంలో ప్రజానుకూల అభివృద్ధి పంథాను నెలకొల్పాలి. రాజపక్సల కుటుంబం పట్ల తొలగిన భ్రమలు సింహళ బౌద్ధ జాతీయవాదం క్షీణించడానికి దారి తీయవచ్చు. భాషాపరమైన, మతపరమైన మైనారిటీల పట్ల ప్రజాస్వామ్యయుత పంథాతో ప్రజా ఐక్యతకు పునాది పడవచ్చని ఆశించాలి.
     రుణం కోసం 'అంతర్జాతీయ ద్రవ్య నిధి' (ఐఎంఎఫ్‌)తో శ్రీలంక ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అంటే దీనివల్ల సంక్షేమంలో కోతలు, పొదుపు చర్యలు, మరింత ప్రైవేటీకరణ వుండొచ్చు. శ్రీలంక లోని ప్రధాన స్రవంతిలో గల రాజకీయ పార్టీలకు ఐఎంఎఫ్‌ ఆదేశాలను పాటించడం తప్ప మరో మార్గం లేదు. అయితే, తీవ్రమైన వ్యవస్థాగత సంక్షోభానికి ఇది పరిష్కారం కాదు. ప్రత్యామ్నాయ పంథాను రూపొందించాల్సిన అవసరం వుంది. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించగల, ఫెనాన్స్‌ పెట్టుబడుల దోపిడీ నుండి శ్రీలంకకు రక్షణ కవచంలా నిలవగల వ్యవస్థ రావాల్సి వుంది. రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించాల్సి వుందని స్పష్టం చేస్తూ, ఇటువంటి మార్పు కోసం పోరాడేందుకై ప్రజలను సమీకరించేందుకు శ్రీలంక లోని వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల ఎదుట ఇదొక అరుదైన అవకాశంగా వుంది.
 

( 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం )