శ్రీకాళహస్తి ఆలయం మాస్టర్ ప్లాన్ సిద్ధం
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో
దక్షిణ కైలాసగిరి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది.. రూ.300 కోట్లతో అభివద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ద్రోణ కన్సల్టెన్సీ సంస్థ తయారు చేసిన డిజైన్ల మేరకు చేపట్టాల్సిన రూ. 300 కోట్ల మాస్టర్ ప్లాన్ పనులను మూడు దశల్లో పూర్తి చేసేలా ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటి క్షేత్రం దక్షిణ కాశీగా వీరాజిల్లుతోంది. సాధారణ రోజుల్లో 25 వేల నుంచి 30 వేల వరకు రద్దీ రోజుల్లో 40 వేలకుపైగా భక్తులు వాయు లింగేశ్వరుడి దర్శనానికి వస్తుండడంతో శ్రీకాళహస్తి దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ అమలు అనివార్యమైంది. ఈ మేరకు 2018లోనే మాస్టర్ ప్లాన్ అమలు కోసం భూసేకరణ జరిగింది. దాదాపు రూ.100కోట్లకుపైగా పరిహారం చెల్లించి భూసేకరణ కూడా పూర్తి చేసినా ఎలాంటి నిర్మాణ పనులు చేపట్ట లేదు.
కోర్టు కేసులు అధిగమించి..
అప్పట్లో కొన్ని కోర్టు కేసులతో భూసేకరణకు సంబంధించి నిర్మాణాల కూల్చివేత ఆగిపోయింది. ఈనేపథ్యంలోనే స్థానిక నేతలు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, పాలకమండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాస్ ప్రత్యేక చొరవ చూపారు. సీఎం జగన్‌ను కలిసి శ్రీకాళహస్తి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు విషయాన్ని దష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హామీ పొందిన పాలకమండలి అధ్యక్షుడు అంజూరి శ్రీనివాస్ మూడు దశల్లో మాస్టర్ ప్లాన్ పనులు చేపట్టేలా దేవాదాయశాఖ నుంచి అనుమతి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
మొదటిదశలో రెండు భారీ భవన నిర్మాణాలను చేపట్టేలా నిర్ణయం తీసుకున్నారు. గాలిగోపురం నుంచి జల వినాయకుడి ఆలయం వరకు రెండతస్తుల భవనం, అక్కడి నుంచి నాలుగో నంబర్ గేటు వరకు ఆలయం చుట్టూ భవన నిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే రూ.105 కోట్లతో ఆరేళ్ల క్రితమే భూసేకరణ పూర్తి చేసిన దేవస్థానం మరో పది రోజుల్లో మొదటి దశ మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. మొదటి దశలో క్యూ కాంప్లెక్స్ లు, సర్ప దోష మండపాలు, దూర్జటి కళా మండపం నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. రెండో దశలో స్వర్ణముఖి ప్రక్షాళన స్నాన ఘట్టాలు, మూడో దశలో భరద్వాజ తీర్థం, అతిథి గ్రహాల నిర్మాణ పనులు చేపట్టనున్న ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాస్ స్పష్టం చేశారు.
మొదటి దశలో..
మొదటి భవనంలో రెండు అంతస్తుల నిర్మాణాలు ఉండగా 330 మీటర్ల పొడవుతో రెండు వైపులా గాలి వెలుతురు ఉండేలా ఓపెన్ క్యూ కాంప్లెక్స్‌లు ఉండేలా నిర్మాణాలు జరగబోతున్నాయి. ఉచిత దర్శనం, రూ.50, రూ.200 టికెట్లు తీసుకున్న భక్తులు దాదాపు 15వేల మంది వరకు మూడు గంటల సమయంలో స్వామి అమ్మవారిని దర్శించుకునేలా క్యూకాంప్లెక్స్ నిర్మాణం మాస్టర్ ప్లాన్ అమల్లో భాగంగా జరగనుంది. ఒక్కో భక్తునికి ఆరు చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా ఆలయంలోకి వెళ్లి వచ్చేలా క్యూ లైన్లను ఏర్పాటు చేయనున్నారు.
రెండవ దశలో..
రెండో భవనం నిర్మాణంలో మూడో నంబర్ గేట్ నుంచి నాలుగో నంబర్ గేట్ వరకు 170 మీటర్ల పొడవుతో రెండంతస్తుల భవనం నిర్మాణం జరగబోతోంది. మొదటి అంతస్తు ఓపెన్ హాల్. వీఐపీలు భక్తులు నేరుగా నాలుగో నంబర్ గేట్ నుంచి వెళ్లి దర్శనం చేసుకునేలా క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక రెండు మూడు దశల్లో స్వర్ణముఖి నది ప్రక్షాళన, స్నాన ఘట్టాలు, భరద్వాజ తీర్థం బ్యూటిఫికేషన్ లాంటి పనులతో మాస్టర్ ప్లాన్ పనులు పూర్తి కానున్నాయి.










