Aug 05,2023 19:09

పూజలు నిర్వహిస్తున్న పీఠాధిపతులు

ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి విశేష పూజలు నిర్వహించారు. శనివారం శ్రీమఠంలోని ఊయల మండపంలో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పగడాల ఆనంద తీర్థాచార్యులు టిటిడి అర్చకులతో కలిసి పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ పుష్పాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళ హారతులు ఇచ్చారు. టిటిడి నుంచి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుని శ్రీమఠం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. పీఠాధిపతులకు టిటిడి నుంచి తెచ్చిన పట్టువస్త్రాలతో అలంకరించి శ్రీవారి ప్రసాదం అందజేశారు. అనంతరం పగడాల ఆనంద తీర్థాచార్యులు దాస సాహిత్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా పీఠాధిపతులు 'హరిదాస సాహిత్య భూషణ్‌' బిరుదుతో సన్మానించారు. రాష్ట్రపతి ప్రతిభ అవార్డు గ్రహీత, డాక్టరేట్‌, పండిత కేసరి, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు రాజా.ఎస్‌.గిరియాచార్యులు, శ్రీమఠం ఎఎఒ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కె.శ్రీనివాసరావు, వెంకటేష జ్యోషి, ఆధ్యాత్మిక అభివృద్ధి అధికారులు శ్రీపతి ఆచార్‌, వాదిరాజాచార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపి.నరసింహమూర్తి, ద్వారపాలకులు అనంతస్వామి, ప్రకాష్‌ రావు, భీమాచార్‌, సహాయక పిఆర్‌ఒ హొన్నొళ్లి వ్యాసరాజాచార్‌, సిబ్బంది బిందు మాధవ స్వామి, జయతీర్థాచార్‌ పాల్గొన్నారు.