ప్రజాశక్తి-ఆదోనిరూరల్
శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆడా కన్వీనర్ ఆదినారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. ఆర్‌సిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, ఆదినారాయణ మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల ప్రకారం ప్రత్యేక హోదా కోల్పోయామని తెలిపారు. రాయలసీమ బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, గుంతకల్ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ కార్యరూపం దాల్చలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన ఆమోదం పొందిన గుండ్రేవుల జాడలేదని తెలిపారు. ఇటీవల కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'అప్పర్ భద్ర'కు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పిస్తూ గణనీయమైన నిధులు విడుదల చేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పునః పంపిణీకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు విధివిధానాలు నిర్ణయించి, అధికారం ఇస్తూ కేంద్రం జిఒ విడుదల చేసిందని తెలిపారు. ప్రశ్నిస్తూ హక్కుల కోసం ఉద్యమించకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని చెప్పారు. ఎమ్మిగనూరులో రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వేదిక కన్వీనర్ నాగన్న, ఆర్‌ఎవిఎఫ్ నాయకులు కృష్ణ, రైతుసంఘం నాయకులు రాజు, బతకన్న, హనీఫ్, నాగరాజు పాల్గొన్నారు.