శ్రీ శ్రీ కవిత ధ్వని ప్రధానాత్మకం
ప్రజాశక్తి - నంద్యాల
నంద్యాల జిల్లా అరసం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ శ్రీ జయంతి వేడుకలను నూనెపల్లి లోని భగత్ సింగ్ జనచైతన్య గ్రంథాలయంలో నిర్వహించారు . ఈ సభకు నంద్యాల జిల్లా అరసం కన్వీనర్ ఎస్ ముర్తుజా అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తలుగా ప్రముఖ న్యాయవాది సామాజిక సేవా కార్యకర్త బి. శంకరయ్య, ప్రముఖ రచయిత కళా మురళి , సీనియర్ పాత్రికేయులు సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి మాదాల శ్రీనివాసులు హాజరయ్యారు . తమ అధ్యక్ష ఉపన్యాసంలో జిల్లా కన్వీనర్ ముర్తుజా మాట్లాడుతూ శ్రీ శ్రీ కవిత అభ్యుదయాత్మకం విప్లవాత్మకం మరియు ధ్వని ప్రధానమైనదని పేర్కొన్నారు. అంతవరకు ఒక వర్గానికే పరిమితమైన కవితను ప్రజల కవితగా మలిచిన ధీరుడు శ్రీ శ్రీ గారని కొనియాడారు. గురజాడ అప్పారావు జాడ చూపించగా వీరేశలింగం తనను ప్రభావితం చేయగా ప్రజా కవితకు ఉద్యమించి గురజాడ బాటను మరింత విస్తృతపరిచి ప్రజల భాషలో ప్రజల కొరకు చక్కని ప్రజా కవిత్వాన్ని శ్రీశ్రీ సృష్టించారని చెప్పారు. ధ్వని ప్రధానమైన కవితకు ఉదాహరణగా నేను సైతం ప్రపంచాగ్నికి అనే కవితను ఉటంకిస్తూ ఇందులో ప్రపంచమంతా బాధలో ఉన్నప్పుడు మనం కూడా ఉలిపికట్టె దారి వేరే దారి అన్నట్టు కాకుండా మనం మన చేయూతను అందించాలని, సమిథలుగా ఆహుతి అవ్వడానికి సైతం వెనుకాడకూడదని పేర్కొన్నారు. ప్రజల కోసం మమేకమై వారి కన్నీటితో మనం కూడా ఆశ్రువులు రాల్చాలని శ్రీ శ్రీ ధ్వని ప్రధానంగా బోధించారని తెలియజేశారు. యువతను సాహితీ ప్రవాహంలోనికి మళ్లించాలని అందుకు తగిన మార్గాలను అన్వేషించవలసిందిగా సాహితీ ప్రముఖులకు వారు సూచించారు. ప్రముఖ రచయిత కళా మురళి మాట్లాడుతూ శ్రీ శ్రీ కవిత్వం అపూర్వమైనదని ఆయన అన్ని విధాల ప్రజల అభ్యుదయాన్ని ఆశించే తన కవిత్వాన్ని తన భావాలను మలిచారని శ్రీశ్రీ విప్లవాత్మకమైన ప్రతిభా సమన్వితమైన ఈ యుగకవి అని ఉద్ఘాటించారు. బి శంకరయ్య మాట్లాడుతూ శ్రీ శ్రీ స్ఫూర్తిదాయకమైనటువంటి కవిత్వ రచనలతో పాటు గొప్ప అభ్యుదయ భావాలను మనకు అందించారని, యువకుల కోసం మనం శ్రీ శ్రీ పంధాలో పయనించాలని అటువంటి మార్గాన్ని తప్పకుండా వెతకవలసి ఉందని అందుకు ఇక్కడున్న సాహితీమూర్తులు అంత తలా ఒక చెయ్యి వేసి సహకరించాలని అందరూ కలిస్తే యువకులను సాహిత్య మార్గం పట్టించడం కష్టం కాబోదని, తన వంతుగా అనేక పుస్తకాలతో కూడిన భగత్ సింగ్ జనచైతన్య విజ్ఞాన గ్రంథాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయగలిగానని యువకులకు నేడిది ఎంతో తోడ్పడుతోందని కూడా తెలియజేశారు . సీనియర్ పాత్రికేయులు సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి శ్రీ మాదాల శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ శ్రీ కవిత్వం ప్రభావశీలమైనదని అది సమాజాన్ని కదిలించి కుదిపేసిందని అసాధారణమైన కవి ఆయన అని తెలియజేశారు. రచయిత మహమ్మద్ రఫీ తమ సందేశాన్ని వినిపిస్తూ శ్రీ శ్రీ కవితలను ప్రతి ఒక్కరూ పఠించాలని పుస్తకాలను చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. రచయిత నీలకంటమాచారి శ్రీ శ్రీ అభ్యుదయ సాహిత్యం పై చక్కని కవిత రాసి చదివారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ బాలరాజు మాట్లాడుతూ శ్రీ శ్రీ మార్గం అనితర సాధ్యమని ఉద్ఘాటించారు. ప్రజా కళాకారులు, పాటల రచయిత అయిన బాల హుస్సేని , కళాకారుడు వీరసేన శ్రీ శ్రీ అభ్యుదయ కవితలను చక్కగా గానం చేసి శ్రోతలను అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలలో ప్రథమ బహుమతి గోస్పాడు జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న మద్దిలేటి , ద్వితీయ బహుమతి విశ్రాంత ఉపాధ్యాయులు నీలకంఠమాచారి సాధించారాని కన్వీనర్ ముర్తుజ ప్రకటించారు. మిగతా బహుమతులకు అర్హమైన రచనలు రాలేదని విచారం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా అరసం జిల్లా కార్యవర్గం ఎంపిక కూడా జరిగింది. జిల్లా అధ్యక్షులుగా ముర్తుజా షేక్ , ఉపాధ్యక్షులుగా మద్దిలేటి , కార్యదర్శులుగా పడకండ్ల మురళి మరియు మహమ్మద్ రఫీ, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప కార్యదర్శులుగా మహబూబ్ బాషా, పివి రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. అరసం నంద్యాల జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులుగా ప్రముఖ రచయిత కళా మురళిని ఎన్నుకున్నారు. తర్వాత రచయిత రఫీ గారి వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.










