Nov 10,2023 23:30

శ్రీ పద్మావతి కార్తీక బ్రహ్మ్రోత్సవాలు ప్రారంభం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం పట్టువస్త్రాలు సమర్పణ

శ్రీ పద్మావతి కార్తీక బ్రహ్మ్రోత్సవాలు ప్రారంభం
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం పట్టువస్త్రాలు సమర్పణ
ప్రజాశక్తి - తిరుచానూరు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, అభిషేకం జరిపారు. అనంతరం నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రం ఉన్న ధ్వజ పటాన్ని ఆరోహణం చేశారు. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి దంపతులు, జేఈవో సదా భార్గవి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో గోవింద రాజన్‌, విజివో బాలిరెడ్డి, ఉద్యాన విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసులు, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసా చార్యులు, కంకణ భట్టార్‌ మణికంఠ స్వామి, అర్చకులు బాబు స్వామి, వేంపల్లి శ్రీను స్వామి పాల్గొన్నారు. అనంతరం ఈవో ఎవి ధర్మారెడ్డి జేఈవో లతో కలసి ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్పకళా శాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, తిరుమల -తిరుపతి స్పిరుచువల్‌ సొసైటీ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన శాలను ప్రారంభించారు. ఈవో ఎవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. రాత్రి 7నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.
అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి జేఈవో వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్‌, ఏఈవో రమేష్‌, విజివో బాలిరెడ్డి పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న పుష్ప ప్రదర్శనశాల
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మౌత్సవాల సందర్బంగా తిరుచానూరులోని శుక్రవారపుతోటలో ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో టీటీడీ ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో 'సోమకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి నాలుగు వేదాలను బ్రహ్మకు మత్స్య అవతారంలో అందిస్తున్న శ్రీమహావిష్ణువు ప్రతిమలు ఏర్పాటు చేశారు . అరణ్యవాసమున సీతమ్మను వెతుకుతూ వెళ్లిన శ్రీరామ లక్ష్మణులకు పండ్లు, తేనే ఆతిథ్యమిస్తున్న భక్త శబరి ప్రతిమల నమూనా భక్తులను ఆకర్షిస్తోంది . వాల్మీకి మహర్షి ఆశ్రమంలో శ్రీరామ కథను ఆలపిస్తున్న లవకుశులు, లక్క గహంలో నిద్రిస్తున్న భీమసేనుడిని పాటతో మేల్కొలుపుతున్న ముసలి రూపంలో శ్రీకష్ణుడు ప్రతిమలు ఏర్పాటు చేశారు . అర్జునుడు బాణాలతో స్వర్గానికి నిర్మించిన నిచ్చెనతో ఐరావతాన్ని తీసుకురావడానికి బయలుదేరుతున్న భీమసేనుడు, అన్నమయ్య తన ఇద్దరు భార్యలతో శ్రీవారిపై కీర్తనలను ఆలపిస్తున్న ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి .అదేవిధంగా, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఎక్స్‌పో ఆయు, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఏర్పాటు చేసిన శిల్ప కళ ప్రదర్శనశాల భక్తులను ఆకట్టుకుంటోంది.