
ప్రజాశక్తి - వన్‌టౌన్ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా మహాోత్సవాలు రెండో రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిచ్చింది. రెండో రోజు సోమవారం తెల్లవారుజాము 4 గంటల నుంచే దుర్గమ్మను దర్శించుకునేందుకు దేవాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే నేడు భక్తుల సంఖ్య నామమాత్రంగానే కనిపించింది. ఉదయం కంటే సాయంత్రం కొద్దిగా భక్తల సంఖ్య పెరిగింది. మొత్తం మీద నేడు సుమారు 40 వేల మంది వరకూ శ్రీ గాయత్రీ దేవి రూపంలో దుర్గమ్మను దర్శించుకున్నట్లు దేవస్థాన అధికారులు చెబుతున్నారు. మొదటిరోజు ఆదివారం కావటంతో అధిక సంఖ్యలో పోటెత్తిన యాత్రికులు నేడు ఆ సంఖ్యలో సగం మంది కూడా వచ్చిన పరిస్థితి కనిపించలేదు. రూ. 500ల టిక్కెట్ల క్యూ లైనులో కూడా కొద్దిమంది మాత్రమే దర్శనానికి విచ్చేశారు. యాత్రికుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డిసిపి విశాల్ గున్ని, ఇతర అధికారులు, దేవాలయ ఇఓ కెఎస్ రామారావు, చైర్మన్ కర్నాటి రాంబాబు దేవాలయ ప్రాంగణంలో తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
దసరా ఉత్సవాల రెండో రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అవతారంలో యాత్రికులకు దర్శనం ఇచ్చారు. ఈ నేపధ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బి. శివ శంకర్, పిఎండి కోర్టు జడ్జి రమణా రెడ్డి, హైకోరు రిజిష్ట్రార్ వెణుగోపాల్, హైకోర్టు న్యాయమూర్తి టి. మల్లికార్జున్‌రావులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్థానిక చిట్టినగర్‌లోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు దసరా రెండో రోజైన సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు . దసరా ఉత్సవాలను పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనగరాల సీతారామస్వామి శ్రీమహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేస్తున్న వేలాదిమంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిత్యం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రతినిత్యం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళావేదికపై పలు సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కాగా కళా వేదికపై సుకాసి విజయలక్ష్మి శిష్య బందం ప్రదర్శించిన నత్యాలు భక్తులను అలరించాయి. దేవస్థానంలో దసరా ఉత్సవాల కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సహాయ కార్యదర్శి పొట్నూరి దుర్గాప్రసాద్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ కొరగంజి భాస్కరరావు ,కార్యవర్గ సభ్యులు పోతిన బేసికంటేశ్వరుడు, మజ్జి ఈశ్వరరావు, మజ్జి శ్రీనివాసరావు, కామందుల నరసింహారావు, పోతిన వెంకట ధర్మారావు, బంక హనుమంతరావు, బెవర సాయి సుధాకర్ పాల్గొన్నారు.
భక్తులకు ప్రసాదాల పంపిణీ
స్థానిక చిట్టినగర్ శ్రీమహాలక్ష్మి దేవస్థానం ఎదురుగా దేవీ నవరాత్రుల సందర్భంగా సోమవారం జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. సుమారు 500 మంది భక్తులకు పులిహౌర ప్రసాదాన్ని అందచేసారు. ఈ కార్యక్రమంలో నగరాల దేవస్థానం కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు పోతిన బేసికంఠేశ్వరుడు, కొరగంజి భాస్కరరావు, బెవర శ్రీనివాసరావు, పోతిన వెంకట ధర్మారావు, టిడిపి నాయకులు భోగవల్లి నాగు, జనసేన 48వ డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ, వేవిన నాగరాజు,పిళ్లా రవి, సాబింకర్ నరేష్, నోచర్ల పవన్‌కల్యాణ్,పులిచేరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత :
దేవాదాయ శాఖ మంత్రి కొట్టు
శరన్నవరాత్రి ఉత్సవాలలో తొలిరోజు గుర్తించిన లోపాలను సరిదిద్దడంతో పాటు సామాన్య భక్తులు దర్శనం కోసం వచ్చే క్రమంలో ఎదురవుతున్న సమస్యలను సైతం చక్కదిద్దినట్లు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సోమవారం మంత్రి కొండ కింది నుంచి క్యూలైన్లను పరిశీలించారు. ఏ యే ప్రాంతాల్లో భక్తులు ఇబ్బంది పడుతున్నారో గుర్తించి తక్షణమే ఆయా ఇబ్బందులను చక్కదిద్దాలని సిబ్బందికి ఆదేశించారు. ఇబ్బందులను సరి చేసిన అనంతరం తిరిగి మళ్లీ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కల్పించాలన్న లక్ష్యం మేరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఎక్కడైనా భక్తులకు ఇబ్బంది కలిగితే అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడం సహజమైనప్పటికీ, అటువంటి సమస్యలు కూడా తలెత్తకుండా ఉద్యోగులు నిబద్ధతతో విధులు నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ఏ భక్తుడి నుంచి ఎటువంటి ఫిర్యాదు రాకుండా తాను కూడా నిరంతరం పర్యవేక్షిస్తానన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఏ శాఖ ఉద్యోగులైనా ఉపేక్షించబోమని కఠినంగా హెచ్చరించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శన భాగ్యం కోసం వస్తున్న భక్తులకు ఏ అంశంలోనూ ఇబ్బందులు కలగకుండా సంతప్తికరమైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు. ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయంలో మాత్రం భక్తులు సహనంతో ఉండాలని కోరారు. అటువంటి సమయాలలో దర్శనంలో కొంత ఎక్కువ సమయం వేచి ఉండటం తప్పదని వివరించారు. అంతకుముందు దేవస్థానం కార్య నిర్వహణ అధికారి కె. ఎస్. రామరావు, దేవదాయ శాఖ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.
పెనుగంచిప్రోలులో...
పెనుగంచిప్రోలు : స్థానిక శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రులు మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం అమ్మవారు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తూర్పు బజార్ శ్రీ దుర్గా మల్లేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా నవరాత్రుల్లో అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. మండపం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ లతో ఆట పాటలు ఆడారు.