Aug 27,2023 22:44

అటవీ శాఖ కార్యాలయం ముందే సరిహద్దు దాటుతున్న కలప

ప్రజాశక్తి - చిలమత్తూరు : చిలమత్తూరు మండలం కర్నాటక బాగేపల్లి ప్రాంతానికి సరిహద్దు ప్రాంతం కావడంతో చిలమత్తూరు మండల నుండి పెద్ద ఎత్తున అటవీ సంపద సరిహద్దులు దాటుతున్నది. కర్నాటకలో చెట్ల నరికివేతకు పెద్దగా అడ్డంకులు లేవు. అయితే అక్కడ గహోపకరణాలకు ఉపయోగపడే వేప వంటి చెట్లు లభించడం తక్కువ కావడంతో వాటికి గిరాకీ బాగా పెరిగింది. సరిహద్దు ప్రాంతంగా ఉన్న చిలమత్తూరులో అటవీ ప్రాంతం అధికంగా ఉండటంతో వేపతో పాటు గహోపకరణాలకు ఉపయోగించే కలప అధికంగా లభిస్తుంది. దీంతో ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున అటవీ సంపదను సరిహద్దులు దాటిస్తున్నారు. ఏకంగా అటవీశాఖ తనిఖీ కేంద్రం ముందు నుండే టన్నుల కొద్దీ అటవీ సంపద సరిహద్దులు దాటుతూంది. అయినప్పటికి అధికారులు ఏ మాత్రం పట్టించుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైన ఉన్నత స్థాయి అధికారులు చొరవ చూపి అక్రమంగా తరలిస్తున్న అటవీసంపదకు కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.