ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని ఖండ్రుమ్ పంచాయతీకి అనుకుని ఉన్న ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు రాయపాడు గ్రామంలో చోటుచేసుకున్న వివాద ఘటనపై చటువ అతిథి గృహంలో సమస్య పరిష్కారానికై ఆంధ్ర, ఒడిశా ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించినట్లు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, తహసిల్దార్ సిహెచ్ నాగమ్మ తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. మండలంలోని ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు విషయమై ఆంధ్ర, ఒడిస్సా అధికారులతో సమావేశాన్ని నిర్వహించి సరిహద్దు ప్రాంతానికి వివాదంగా మారిన రాయపాడు విషయంపై రెండు రాష్ట్రాల అధికారులు చర్చించుకోవడం జరిగిందన్నారు. ఆ గ్రామం ఒడిస్సా లేక ఆంధ్ర సరిహద్దుకు వర్తించాలన్న దానిపై అన్ని కోణాల్లో సర్వే ద్వారా నిర్ణయించాల్సి ఉందన్నారు. ఈ సమావేశానికి ఆంధ్ర నుంచి మండల రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో పాటు ఒడిస్సా కోరాపుట్ సబ్ కలెక్టర్, నందపూర్ ఎస్‌డిపిఓ, బిడిఓ పాల్గొన్నట్లు పేర్కొన్నారు.










