Aug 06,2021 12:12

న్యూఢిల్లీ : గత కొన్ని రోజుల నుండి నలుగుతున్న సరిహద్దు వివాదంపై అసోం, మిజోరాం ప్రభుత్వాలకు చెందిన సీనియర్‌ మంత్రులు గురువారం వివరణాత్మక చర్చలు జరిపారు. ఈ వివాదానికి సంబంధించిన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటాయని ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ డిప్యూట్‌ చేసిన ఇద్దరు సీనియర్‌ మంత్రులు అతుల్‌ బోరా, అశోక్‌ సింఘాల్‌ ఐజ్వాల్‌ వెల్లి..మిజోరా ంహోం మంత్రి లాల్చమ్లియానాతో చర్చించారు. అంతకముందు ఈ రాష్ట్ర ప్రజలు మిజోరాంను సందర్శించకూడదన్న ఉత్తర్వులను అసోం ప్రభుత్వం రద్దు చేసిందని అధికారులు తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ చొరవతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అంగీకరించాయని, ఇరు రాష్ట్రాల్లో ఉన్న ఉద్రికత్తలను తొలగించేందుకు..చర్చల ద్వారా వివాదాలకు, శాశ్వత పరిష్కారాలను కనుగొనేందుకు ముఖ్యమంత్రులు అంగీకరించారని ప్రకటన పేర్కొంది. అంతరాష్ట్ర సరిహద్దుల్లో శాంతిని కాపాడేందుకు, కేంద్ర బలగాలను మోహరించడాన్ని అంగీకరించిన ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు..ఇరు రాష్ట్రాలకు చెందిన అటవీ, పోలీసు అధికారులను పెట్రోలింగ్‌, ఆధిపత్యం, మరో పరిణామాల కోసం పంపకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. ఇటీవల అసోం-మిజోరాం సరిహద్దులో రెండు రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య ఘర్షణలు నెలకొన్న సంగతి విదితమే.