అటవీ అధికారులకు కలెక్టర్ ఆదేశం
ప్రజాశక్తి - కాకినాడ
రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా సమగ్ర భూసర్వే నిర్వహిస్తోందని ఈ నేపథ్యంలో అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి అటవీ భూముల సరిహద్దులకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికాశుక్లా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అటవీ కమిటీ, జిల్లా వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశాలు జరిగాయి. ఎస్‌పి ఎస్.సతీష్‌కుమార్, జెసి ఎస్.ఇలాక్కియా, డిఎఫ్‌ఒ ఎస్.భరణి తదితరులు హాజరయ్యారు. సమగ్ర భూ సర్వే-అటవీ సరిహద్దులు, సామాజిక అడవులు, మడ అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ తదితర అంశాలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర రీసర్వేను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అప్రమత్తతతో వ్యవహరించి అటవీ భూముల సరిహద్దులకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. అటవీ, రెవెన్యూ, సర్వే, భూ రికార్డుల అధికారులు కీలకంగా వ్యవహరించాలన్నారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య చట్టాలు పటిష్టంగా అమలయ్యేలా చూడాలన్నారు. కోరింగ పరిసర ప్రాంతాల్లోని ఆక్వా రైతులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. ఫిషింగ్ క్యాట్, తాబేళ్లకు ఎలాంటి అపాయం జరక్కుండా చూడాలన్నారు. కష్ణజింక, నెమళ్లు తదితరాలకు అపాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పంట పొలాలకు వేసే విద్యుత్ కంచెల వల్ల వన్యప్రాణులకు జరుగుతున్న అపాయంపై క్షుణ్నంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు తీరానికి వచ్చి గుడ్లు పెట్టే సమయాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించాలన్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని పట్టుకొని, అటవీ ప్రాంతాల్లో వదలడం, అదే విధంగా స్టెరిలైజేషన్‌కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంటలు చెలరేగితే పరిసర గ్రామాల ప్రజలు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్‌పి మాట్లాడుతూ జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరివర్తన కార్యక్రమాల వల్ల చాలావరకు నాటుసారా సమస్య తొలగిందన్నారు. ఏలేశ్వరం, కోరింగ తదితర ప్రాంతాలపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్‌డిఒ ఎన్‌వివి. సత్యనారాయణ, సెబ్ అడిషనల్ ఎస్‌పి ప్రేమ్‌కాజల్, పశుసంవర్థక శాఖ జెడి డాక్టర్ సూర్యప్రకాష్‌రావు, మత్స్యశాఖ జెడి పివి.సత్యనారాయణ, డిపిఒ ఆర్.విక్టర్, సర్వే ఎడి బి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.










