ప్రజాశక్తి-పాడేరు:గిరిజనుల పట్ల గిరిజన ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు పట్ల గౌరవం లేని పాడేరు ఐటీడీఏ పిఓ ను తక్షణమే సరెండర్ చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సురేంద్ర హెచ్చరించారు. ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో వరుసగా సంభవిస్తున్న గిరిజన విద్యార్థుల మరణాలపై అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ప్రజా సంఘాల ఐక్య వేదిక బుధవారం ఐటిడిఏ వద్ద తలపెట్టిన మహా ధర్నా విజయవంతమైంది. విద్యార్థులు ర్యాలీగా ఐటిడిఏ వద్దకు తరలివచ్చారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ, 17 రోజులుగా పాడేరు ఐటీడీఏ వద్ద దీక్షలు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంతో మహా ధర్నాకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ మహాధర్నాను ఆపేందుకు కుయుక్తులు పన్నినా ఉద్యమాన్ని ఆపలేకపోయారని తెలిపారు. నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణ మన్నారు. ప్రభుత్వం స్పందించేంతవరకు ఉద్యమం ఆపేది లేదని, వెంటనే జోక్యం చేసుకొని, గిరిజన విద్యార్థుల వరస మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాలు అరికట్టేందుకు తక్షణమే ఆశ్రమాల్లో హెల్త్ అసిస్టెంట్లను నియమించాలని తెలిపారు. గిరిజన ఆశ్రమ విద్యార్థుల మరణాలు అరికట్టేందుకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలన్నారు. ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రెండు నెలల వ్యవధి కాలంలోనే ఆరుగురు విద్యార్థులు మరణించినా అధికారులకు, ప్రభుత్వానికి చలనం లేదని తెలిపారు. విద్యార్థుల సమస్యల్ని ఐటిడిఏ పిఓ గోపాలకష్ణ పట్టించుకోవడం మానేశారని, ఆశ్రమాల్లో విద్యార్థులు చర్మవ్యాధులతో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెదబయలు తహసీల్దార్ ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని, బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాడేరు ఐటీడీఏ పీవో ను రక్షించడం కోసం, అమాయక ఉద్యోగులను బలి చేయడం సరికాదని, వారి సస్పెండ్‌ను తక్షణమే ఎత్తి వేయాలని తెలిపారు. ప్రజా సంఘాల ప్రతినిధులను గిరిజన విద్యాసంస్థల్లో ప్రవేశాన్ని నిరాకరిస్తూ గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్కులర్ తక్షణమే రద్దు చేయాలన్నారు.
ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ కూడా రాధాకృష్ణ, కో కన్వీనర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఈ మహా ధర్నాను భగం చేయడానికి అనేక కుయుక్తులు పన్నారని, తెల్లారి ఐదు గంటల నుండి పోలీసులు ప్రతి ఆశ్రమ హాస్టల్స్, కాలేజీలలో పహారాతో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. 17 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపడుతున్నా గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీ స్పందించక పోవడం చాలా దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పి.లక్కు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఫణీంద్ర, రాజశేఖర్, ఏఐటీయూసీ నాయకుల అమర్, జీవన్ కృష్ణ, మహిళా సంఘం నేతలు కంబిడి లతా కుమారి, కెజియా రాణి , స్వరూప, రవణమ్మ, ప్రజా సంఘాల వేదిక నాయకులు చిన్నారావు, వరహాలబాబు, టి.చిరంజీవి, పి.ప్రకాష్, బత్తిరి నరేష్, జాన్ వెస్లీ గిరిజన సంఘం నాయకులు రాందాస్ తదితరులు పాల్గొన్నారు.










