Aug 20,2023 00:06

లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తున్న శ్రీ వాసవీ ఫౌండేషన్‌ ప్రముఖుల



ప్రజాశక్తి-విజయవాడ, వన్‌టౌన్‌, అర్బన్‌ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర శనివారం సాయంత్రం ఎన్‌టిఆర్‌ జిల్లాలోకి ప్రవేశించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి వచ్చిన పాదయాత్ర ప్రకాశం బ్యారేజ్‌ వద్ద విజయవాడలోకి అడుగుపెట్టింది. లోకేష్‌కు బ్యారేజీ వద్ద ఎన్‌టిఆర్‌, కృష్ణాజిల్లాల నుండి వేలాదిగా తరలివచ్చిన టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానాలు ఘన స్వాగతం పలికారు. వివిధ వేషధారణలు, డప్పు వాయిద్యాలతో వన్‌టౌన్‌ రథం సెంటర్‌ మారుమోగిపోయింది. పాదయాత్ర కెనాల్‌రోడ్డులో వినాయకుడిగుడి, కాళేశ్వరరావు మార్కెట్‌, లోబ్రిడ్జి, తుమ్మలపల్లి కళాక్షేత్రం, పోలీసు కంట్రోల్‌ రూమ్‌, ఏలూరు రోడ్డు, విశాలాంధ్ర రోడ్డు మీదుగా ఎంజి రోడ్డులోకి ప్రవేశించింది. అనంతరం ఎంజి రోడ్డులో యాత్ర సాగింది. రాత్రి 9.30 గంటల సమయంలో పాదయాత్ర ముగిసింది. నగరంలోని ఎ కన్వెన్‌సెంటర్‌ వద్ద సమీపంలో లోకేష్‌ బస చేశారు. పోలీసు కంట్రోల్‌ రూమ్‌ వద్ద సెంట్రల్‌ నియోజకవర్గంలోకి సాయంత్రం 6 గంటల సమయంలో పాదయాత్ర ప్రవేశించి రాత్రి 9 గంటలకు ముగిసింది. పోలీసు కంట్రోల్‌ నుంచి ఏలూరు రోడ్డులో చుట్టుగుంట సెంటర్‌ వరకు, అక్కడ నుంచి మెట్రో మార్ట్‌ సెంటర్‌ వరకు పాదయాత్ర సాగింది. పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నుంచి పాత బస్టాండ్‌ సెంటర్‌, స్వర్ణప్యాలెస్‌, బీసెంట్‌ రోడ్డు, విజయా టాకీస్‌ సెంటర్‌, కొత్త వంతెన సెంటర్‌, సీతారామ్‌పురం జంక్షన్‌, చుట్టుగుంట సెంటర్‌, విశాలాంధ్ర రోడ్డు, మెట్రో మార్ట్‌ సెంటర్‌ వరకు సాగింది. అక్కడ నుంచి తూర్పునియోజకవర్గంలోకి ప్రవేశించింది. తొలి నుంచి చివరి వరకు దారిపొడవున ఐదు వేల మంది వరకు జనం ఉండవచ్చునని పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం. ఆది నుంచి చివరి వరకు ఒక వైపున డివైడర్‌, మరొక వైపున పుట్‌పాత్‌ మీద నిలబడి లోకేష్‌కు జనం స్వాగతం పలికారు. నియోజకవర్గంలోకి ప్రవేశించే పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సెంటర్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన కుమారుడి పేరుతో తయారు చేసిన గజమాలను పెద్ద క్రేన్‌ సాయంతో లోకేష్‌ మెడలో వేసి, నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి పాతబస్టాండ్‌ సెంటర్‌లో టిఎన్‌టియుసి ఆధ్వర్యంలో నారాలోకేష్‌కు గజమాల వేసి కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. సీతారామ్‌పురం జంక్షన్‌ ఏరియాలో యాదవ సంఘం నాయకులు, అలాగే చుట్టుగుంట సెంటర్‌లో టిఎన్‌ఎస్‌ఎఫ్‌, మెట్రో మార్ట్‌ సెంటర్‌లో ఆ ఏరియాలోని టిడిపి యూత్‌ నారాలోకేష్‌కు గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో ఎక్కువుగా యూత్‌ పాల్గొనడం కనిపించింది. దారిపొడవున నారాలోకేష్‌ జిందాబాద్‌, టిడిపి వర్ధిల్లాలంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. లోకేష్‌ వెంట పార్టీ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, సీనియర్‌ నాయకులు కేశినేని శివనాధ్‌ (చిన్ని), నియోజకవర్గం ఇన్‌చార్జి, పోలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, అలాగే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, గుడివాడ్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్‌, పార్టీ రాష్ట్ర నాయకులు కొమ్మారెడ్డి పట్టాభి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నె వెంకటనారాయణప్రసాద్‌ (అన్న), విఎంసిలోని టిడిపి ప్లోర్‌లీడర్‌ నెల్లిబండ్ల బాలస్వామి, సీనియర్‌ నాయకులు, కార్పొరేటర్‌ జాస్తి సాంబశివరావు, టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి గొట్టుముక్కల రఘురామరాజు తదితరులు నడిచారు. ఈ పాదయాత్రలో విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్‌ (నాని) జాడే కనిపించలేదు. అయితే ఆయన అనుచరులు అనుకున్న పలువురు సీనియర్‌ నాయకులు మాత్రం పాదయాత్రలో పాల్గొనడం గమనార్హం. అయితే రోడ్డు పొడవున సీనియర్‌ నాయకులు చిన్నితో కలిసి బొండా ఉమాతో ఏర్పాటు చేసి ఉన్న ప్లెక్సీలు మాత్రమే దర్శనమిచ్చాయి. బందర్‌ రోడ్డులోని విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్‌ (నాని) తన ఎంపి కార్యాలయం ఎదురుగా నారాలోకేష్‌కు స్వాగతం చెప్తూ ఆయన అభిమానులు రౌండ్‌గా ఏర్పాటు చేసిన పెద్దపాటి హోర్డింగ్‌లోని ఎంపి బొమ్మ ఉన్న చోట చించివేయడం గమనార్హం. పాదయాత్ర పొడవున ఆయా సమస్యలపై పలువురు లోకేష్‌కు వినతిపత్రాలు అందజేశారు. పాదయాత్ర దారిపొడవున రోడ్డుకిరువైపుల చేతులెత్తి నమస్కరించడం, అభివాదం చేస్తూ లోకేష్‌ తన పాదయాత్రను కొనసాగించారు. నియోజకవర్గంలోని సింగ్‌నగర్‌, ఇతర ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. దారి పొడవున స్వాగతాలు చెప్పారు. కాబోయే సిఎం లోకేష్‌ అంటూ అక్కడక్కడ యూత్‌ నినాదాలు చేయడం వినిపించింది. అలాగే జై బాలయ్య అనే నినాదాలు కూడా చేశారు. అయితే ఏదో ఒక సెంటర్‌లో లోకేష్‌ మాట్లాడతారని అనుకున్న ప్రజలకు నియోజకవర్గం పరిధిలో ఎక్కడా కూడా మాట్లాడకుండానే వెళ్లిపోవడం ఒకింత పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కల్గించిందని అక్కడక్కడ వినిపించింది.
సెల్ఫీలకే ప్రాధాన్యత
- సెల్‌ఫోన్లతో యువత ఎదరుచూపు
- ప్రజా సమస్యలకు తక్కువ సమయం
- నేడు తూర్పులో పాదయాత్ర
- ఉదయం పారిశ్రామికవేత్తలతో సమావేశం
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ విజయవాడ, వన్‌టౌన్‌ : యువగళం పాదయాత్ర శనివారం రాత్రి 8.30 గంటలకు మొగల్‌రాజపురం వద్ద విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ప్రవేశించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్‌ పాదయాత్ర సందర్భంగా స్థానికులతో కరచాలనం చేయడంతో పాటు ఎక్కువగా సెల్ఫీ దిగడానికి ప్రాధాన్యత ఇచ్చారు. యువత, మహిళల కూడా తమ ఫోన్లను చేత పట్టుకుని పాదయాత్ర ప్రాంతాలలో వేచి ఉండటం కనిపించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంకు సంబంధించి మొగల్‌రాజపురం మెట్రో వద్ద నుండి రెడ్‌ సర్కిల్‌ మీదుగా శిఖామణి సెంటర్‌, వాటర్‌ ట్యాంకు రోడ్డు నుండి ఎం.జి.రోడ్డు మీదుగా బృందావన్‌ కాలనీలోని వజ్ర గ్రౌండ్‌ వరకు జరిగింది. రాత్రి 8.30 గంటలకు యువగళం పాదయాత్ర తూర్పు నియోజకవర్గంలోని ప్రవేశించగా రాత్రి 10.15 గంటలకు వజ్ర గ్రౌండ్‌కు చేరుకోవడంతో పాదయాత్ర ముగిసింది. పాదయాత్రలో బాగంగా స్థానిక యువతతో చేతులు ఊపుతూ, కరచాలనం చేస్తూ లోకేష్‌ ముందుకు సాగారు. అయితే స్థానిక మహిళలు, యువత కొంత మంది ఎదోచెప్పబోతుండగా సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి నెట్టివేయడం కనిపించింది. కొంత మంది వద్దకు లోకేష్‌ స్వయంగా వెళ్లి సెల్ఫీ దిగడం కనిపించింది. అయితే పాదయాత్రలో స్థానికులతో ఎక్కువగా సెల్ఫీలకే ప్రాధాన్యత ఇచ్చారు. తప్ప స్థానిక సమస్యలను వినేందుకు ఎక్కువ సమయం కేటాయించలేదని పలువురు మహిళలు అనడం కనిపించింది. వాటర్‌ ట్యాంకు రోడ్డు నుండి ఎం.జి.రోడ్డు చేరుకునే సందర్భంగా స్థానికులు , మహిళలు పెద్ద సంఖ్యలో నారా లోకేష్‌కు స్వాగతం చెపుతూ గజమాలతో సత్కారం చేశారు. ఎం.జి.రోడ్డులో స్థానికులు ఎక్కువగా నారా లోకేష్‌ కేసం డివైడర్‌పై వేచి ఉండటం కనిపించింది. నారా లోకేష్‌ వెంట విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు గద్దె రామమోహన్‌, మాజీ శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్‌, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నేడు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో సమావేశం
యువగళం పాదయాత్రలో భాగంగా తూర్పు నియోజకవర్గం బృందావన్‌ కాలనీలో బస చేసిన నారా లోకేష్‌ ఆదివారం ఉదయం నుండి మద్యాహ్నం వరకు వివిధ రంగ ప్రముఖులతో సమావేశమవనున్నారు. పారిశ్రామికవేత్తలతో పాటు ఆటోనగర్‌లోని ఆటోమొబైల్‌ రంగ ప్రముఖులతో సమావేశమవనున్నారు. మద్యాహ్నం 2 గంటలకు బృందావన్‌ కాలనీ నుండి పాదయాత్ర ప్రారంభమై డివి మానర్‌ మీదుగా పిన్నమనేని పాలి క్లినిక్‌ర రోడ్డు, నిర్మాలా కాన్వెంట్‌ రోడ్డు నుండి పటమటలోకి ప్రవేశిస్తుంది. హైస్కూల్‌ రోడ్డు, ఆటోనగర్‌ మీదుగా సనత్‌ నగర్‌ వద్ద పెనమలూరు నియోజకవర్గంకు చేరుకుంటుందని నిర్వాహకులు ప్రకటించారు.
యువగళ పాదయాత్రలో కనిపించని ఎంపి కేశినేని
ప్రజాశక్తి - వన్‌టౌన్‌, విజయవాడ, అర్బన్‌ : నగరంలో శనివారం జరిగిన నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో విజయవాడ ఎంపి కేశినేని నాని కనిపించలేదు. నాని తమ్ముడు, టిడిపి నాయకులు కేశినేని శివనాథ్‌ (చిన్ని)కి యువగళం పాదయాత్ర బాధ్యత అప్పగించడంతో దూరంగా ఉన్నట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం దూరం పెట్టిందా లేక ఆయన దూరంగా ఉంటున్నారా అనేది ప్రశ్నగా ఉంది. కొన్ని నెలల్లో రాస్ట్రంలో ఎన్నికలు రానున్న తరుణంలో కేశినేని బ్రదర్స్‌లో ఎవరికీ ప్రాధాన్యత లభించనుందో వేచి చూడాల్సిందే.
లోకేష్‌ను కలిసిన శ్రీ వాసవీ ఫౌండేషన్‌ ప్రముఖులు
యువగళం పాదయాత్రలో వన్‌టౌన్‌ వినాయకుని గుడి వద్ద టిడిపి యువనేత నారా లోకేష్‌ను శ్రీ వాసవీ ఫౌండేషన్‌కు చెందిన ఆర్య వైశ్య ప్రముఖులు వక్కలగడ్డ భాస్కరరావు, డూండీ రాకేష్‌, నూకల నాగేశ్వరరావు, వివికె నరసింహారావు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వైశ్య కార్పొరేషన్‌ పునరుద్ధరణ, వైశ్యుల దామాషా ప్రకారం నిధులు కేటాయింపు చేయాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిడిపి సీటును ఆర్యవైశ్యులకు కేటాయించాలని కోరారు. కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద కొందరు ముఠా కార్మికులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 40వ డివిజన్‌ టిడిపి అధ్యక్షులు చినసుబ్బయ్య, 42వ డివిజన్‌ యేదుపాటి వెంకటరమణి, 44వ డివిజన్‌ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం తెలుగుతమ్ముళ్లు పెద్దయెత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్‌ యేదుపాటి రామయ్య తదితరులు లోకేష్‌కు పూలమాలను వేసి స్వాగతం పలికారు.