
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : విద్యుత్ ఛార్జీల పెంపుతో సగటు వినియోగదారులు విలవిల లాడుతున్నారు. గృహ వినియోగదారులు, చిన్నవ్యాపారులు, రైతులు, ఫెర్రో పరిశ్రమల యాజమాన్యాలు ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నాయి. సర్థుబాటు. ట్రూ అప్ ఛార్జీల పేరిట మోపిన భారం వల్ల జిల్లాపై ఏడాదికి సుమారు రూ.24కోట్ల మేర భారం పడుతోంది. బిజెపి ఆధ్వర్యాన వైసిపి ప్రభుత్వం మోపుతున్న విద్యుత్ భారాలపై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమౌతోంది. ఈనేపథ్యంలో విజయనగరం ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వాప్తంగా విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యాన చేపడుతున్న ఆందోళనా కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వామ్యమౌతున్నారు. సిపిఎం పోరాటంలో భాగంగా విజయనగరంలోని ఎన్‌పిఆర్ (సిపిఎం) కార్యాలయంలో ఈనెల 19న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సుకు ముఖ్య వక్తలుగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు, బి.తులసీదాస్ హాజరు కానున్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లాలో 8,11,017 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహాలకు 6,71,921, వాణిజ్యం 68,939, ప్రభుత్వ కార్యాలయాలకు 15,321, వ్యవసాయ పంపుసెట్‌లకు, 52,082 ఉన్నాయి. వీటన్నింటికీ ఎపిఇపిడిసిఎల్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతోంది. వినియోగదారులంతా ఎప్పటికప్పుడే బిల్లులు చెల్లిస్తున్నారు. ఒక వేళ గడువు తేదీలోపు చెల్లించకపోతే ఫీజులు పీకేసి మరీ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. అయినప్పటికీ వినియోగదారులు చెల్లించిన డబ్బులు విద్యుత్తు ఉత్పత్తికి, పంపిణీ తదితర ఖర్చులకు సరిపోలేదంటూ వసూలు చేస్తున్నారు. సర్థుబాటు ఛార్జీ అంటే ఇదే. మరే సంస్థలోనూ లేని విధంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లోనే ఇటువంటి విధానం ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే 2014 నుంచి 19 వరకు వినియోగించుకున్న విద్యుత్‌కు చెల్లించిన బిల్లులు సరిపోలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,900 కోట్లమేర సర్థుబాటు భారం మోపింది. జనం నుంచి మూడేళ్లపాటు వసూలు చేయడానికి విద్యుత్ ఛార్జీల నియంత్రణ మండలి ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలు ఆమోదం పొందాయి. ఇప్పటికే యూనిట్‌కు 20పైసలు చొప్పున 11నెలల పాటు వినియోగదారులు అదనంగా చెల్లించారు. మరో 25 నెలలపాటు చెల్లించాల్సి వుంది. ఇది చాలదన్నట్టుగా 2021 -22 ఆర్థిక సంవత్సరంలో వినియోగించిన విద్యుత్ బిల్లులకు చెల్లించిన మొత్తం సరిపోలేదంటూ మరోసారి 20పైసలు చొప్పున సర్థుబాటు ఛార్జీలు మోపుతున్నారు. పాత, కొత్త సర్థుబాటు ఛార్జీలు 40పైసలు మోయడమే వినియోగదారులకు అత్యంత కష్టతరంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ భారాన్ని తగ్గించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పడుతున్న భారాలకు ఎప్పటి వరకో ఎందుకు ఆగాలి అంటూ మరుచటి నెలలోనే సర్థుబాటు ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశించింది. మోడీ ఆదేశాలే తడువుగా జగన్ సర్కారు ఏప్రిల్ నెలలో చెల్లించిన డబ్బులు సరిపోలేదని మరో 40పైసలు వసూళ్లకు సిద్ధపడింది. ఈ లెక్కన కేవలం సర్థుబాటు ఛార్జీ రూపంలోనే 80పైసలు భారం పడుతోంది. జిల్లాలో రోజుకు సుమారు కోటి యూనిట్ల వినియోగం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వాసులపై నెలకు రూ.80లక్షల వరకు భారం పడుతోంది. ఏడాదికి రూ.24కోట్ల భారం పైమాటే. దీనికితోడు నెలవారీ వినియోగపు బిల్లు, ఫిక్స్‌డ్ ఛార్జీ, కస్టమర్ ఛార్జీ, ట్రూ అప్ ఛార్జీ తదితరాల రూపంలో అధిక మొత్తంలో బిల్లులు విధించారు. 20 నుంచి 30 యూనిట్లు వినియోగించిన సామాన్య కుటుంబాలకు వేల రూపాయల బిల్లులు వస్తున్నాయి. దీంతో, గత నెలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో బిల్లులు వచ్చాయంటూ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఛార్జీకన్నా ఇలా కొసరుగా విధిస్తున్న ఛార్జీలే అధికంగా ఉన్నాయి. వాస్తవానికి సర్థుబాటు ఛార్జీలకు పాలకుల విధానాలే కారణం. బొగ్గు, ఇంధన రేట్లు కార్పోరేట్ సంస్థలు తమ ఇష్టానుసారంగా పెంచుకునేందుకు సహకరిస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ తయారీ, పంపిణీ సంస్థలపై పెరిగిన భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమవుతున్నాయి.
6 యూనిట్లకు రూ.196 బిల్లు వచ్చింది
నేను అద్దెకు తీసుకున్న ఇల్లు మూడు నెలలుగా మూతపడి ఉంది. కరెంటు పూర్తిగా వాడలేదు. కానీ, 6యూనిట్లు వినియోగించినట్టుగా బిల్లలు వచ్చింది. బిల్లు మాత్రం రూ.196 వచ్చింది. ఇది చాలా దారుణం. ఆరు నెలల క్రితం కనీస ఛార్జీ రూ.60 మాత్రమే వచ్చేది. ఎందుకింతలా భారం పడుతోందంటే విద్యుత్ శాఖ సిబ్బంది ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు. ఎప్పుడో వినియోగించిన విద్యుత్‌పై ఇప్పుడు ఛార్జీలు విధిస్తున్నట్టు సిపిఎం నాయకుల ప్రచారం ద్వారా అర్థమౌతోంది. ప్రభుత్వానికి డబ్బులు గుంజుకోవడం తప్ప, ప్రజలపై పడుతున్న భారాలు గుర్తుకు రావడం లేదు.
గవర వెంకటరమణ కర్రోతు వీధి, సీతానగరం
ఛార్జీల పెంపుతో భారంగా మారింది
విద్యుత్‌ఛార్జీల యూనిట్ ధర డబుల్ రావడంతో భారంగా మారింది. మెకానిక్ రంగంలో బతకడం కష్టంగా ఉంది. ప్రతినెలా ఛార్జీలు పెరిగిపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోగలుగుతాం. అప్పుడెప్పుడో వాడిన విద్యుత్తుకు ఇప్పుడు ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారు. యూనిట్లలో తేడా లేకపోయినప్పటికీ అదనపు ఛార్జీలు వసూలు చేయడం అన్యాయం.
జె.మహేష్, మెకానిక్, విటి అగ్రహారం, విజయనగరం
కరెంటు బిల్లు రెట్టింపైపోయింది
మాకు వస్తున్న కరెంటు బిల్లు రెట్టింపైపోయింది. విద్యుత్ వినియోగం మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. వినియోగించింది కూడా రెండు ఒక ఫ్యాను, మూడు లైట్లే. గతంలో నెలకు రూ.220 నుంచి రూ.230 వరకు కరెంటు బిల్లు వచ్చేది. గత మే నెల నుంచి రూ.500కు పైగా బిల్లు వస్తోంది. ఈనెల రూ.537 బిల్లు వచ్చింది. మరోవైపు నిత్యవసర సరుకులు, గ్యాస్ తదితరాల ధరలు బాగాపెరిగాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల భారం ఇబ్బందికరంగా మారింది.
దాలి రాములమ్మ లక్ష్మీపురం, సీతానగరం మండలం