
వినియోగదారులకు షాకిస్తున్న విద్యుత్ బిల్లులు
అదనపు ఛార్జీల పేరిట బాదుడే బాదుడు
భారాలకు సామాన్య ప్రజలు గగ్గోలు
రూ.700 బిల్లు వస్తే సగం అదనపు ఛార్జీలే
ఉచితాల కింద రూపాయి ఇచ్చి రూ.పది దోపిడీ అంటూ జనాల్లో చర్చ
ఈ నెల మూడో తేదీన తీసిన కరెంటు బిల్లులో అదనపు భారాలు ఇలా..
వాడుకున్న కరెంటుకు వచ్చిన బిల్లు రూ.394.50
ఫిక్స్‌డ్ ఛార్జీ - రూ.20
కస్టమర్ ఛార్జీ - రూ.45
ఇడి ఛార్జీ - రూ.7.20
సర్‌ఛార్జీలు - రూ.25
ఇడిఐఎన్‌టి - రూ.0.07
ట్రూ అప్ ఛార్జీ - రూ.68
ఎఫ్‌పిపిసిఎ ఛార్జీ - రూ.127
ఎఫ్‌పిపిసిఎ2 ఛార్జీ - రూ.49
లాస్‌గెయిన్ ఛార్జీ - రూ.0.23
మొత్తం బిల్లు - రూ. 736
వాడుకున్న కరెంటు బిల్లు రూ.394.50, అదనపు ఛార్జీల వడ్డన రూ.342
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
కరెంటు బిల్లుల మోతతో సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. అడ్డూఅదుపూ లేని ఈ బాదుడు ఏమిటంటూ ప్రభుత్వంపై తీవ్ర అగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బిల్లులో సగం అదనపుఛార్జీల భారమే ఉండటంతో జనం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో ప్రతినెలా బిల్లులు కట్టలేక సామాన్య ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 12 లక్షల గృహవిద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అత్యధిక కనెక్షన్లు సామాన్య ప్రజానీకానివే. విద్యుత్ ఛార్జీల పెంపుతో పాటు, అదనపు ఛార్జీల భారం వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా తర్వాత సామాన్య ప్రజానీకం ఆదాయాలు భారీగా తగ్గిపోయాయి. పెట్రోల్, డీజిల్ పెరుగుదల, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్య ప్రజానీకం జీవనం కష్టంగా మారింది. ముఖ్యంగా పట్టణాల్లో పనిచేసే చిరుద్యోగులు, హమాలీలు, చిరువ్యాపారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. చిరుద్యోగులకు రూ.పది నుంచి రూ.15వేలలోపే జీతాలొస్తున్నాయి. ఈ జీతంతో ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఆసుపత్రి ఖర్చులు వంటివి నెట్టుకు రావడమే గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.400 కరెంటు బిల్లుకు మరో రూ.400 అదనపు ఛార్జీలు వేయడంతో మోయలేని భారంగా మారింది. ఫిక్స్‌డ్ ఛార్జీలు, కష్టమర్, ఇడి, సర్‌ఛార్జీలతోపాటు, ట్రూ అప్ ఛార్జీలు, ఎఫ్‌పిపిసిఎ ఛార్జీలు భారీగా వేస్తున్నారు.
అక్టోబర్ నెల మొదటివారంలో తీసిన కరెంటు బిల్లు రూ.736 రాగా, అందులో ఫిక్స్‌డ్ ఛార్జీ రూ.20, కష్టమర్ ఛార్జీ 45, ఇడి ఛార్జీ రూ.7.20, సర్‌ఛార్జీ రూ.25, ట్రూఅప్ ఛార్జీ 68, ఎఫ్‌పిపిసిఎ ఛార్జీ 127, ఎప్‌పిపిసిఎ-2 ఛార్జీకింద రూ.49 మొత్తం రూ.342 అదనపు ఛార్జీల భారం పడింది. అంటే బిల్లులో సగం అదనపుఛార్జీలే ఉన్నాయి. గడిచిన కొన్నినెలలుగా ఇదేవిధంగా విద్యుత్ బిల్లులు వస్తుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్య ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా కరెంటు బిల్లుల మోత జనాన్ని కోలుకోలేనివిధంగా దెబ్బతీస్తోంది. ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల వాడకం భారీగా పెరిగింది. ఫ్రిజ్, కూలర్, మిక్సీ, గ్రైండర్, ఐరన్ బాక్స్ వాడకాలు పెరగడంతో పెరిగిన ఛార్జీలతో బిల్లు తడిసిమోపుడువుతోంది. మళ్లీ అదనంగా ఛార్జీల భారం వేయడంతో సామాన్యులు సైతం ప్రతినెలా రూ.వెయ్యికిపైగా బిల్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. కరెంటు బిల్లు భారం మోయలేక సకాలంలో కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నారు. సకాలంలో బిల్లులు కట్టలేని వినియోగదారులపై ఫైన్‌ల భారం పడుతోంది. ఒక్కరోజు ఆలస్యమైన బిల్లుకు రూ.వంద ఫైన్ చెల్లించాల్సి వస్తోంది. బిల్లులు సకాలంలో కట్టకపోతే విద్యుత్ అధికారులు ఫీజులు పీకేస్తూ జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి ప్రభుత్వం రూ.పది లాగేస్తుందంటూ జనంలో తీవ్ర చర్చనడుస్తోంది. విద్యుత్ భారాలను నిరసిస్తూ ఇప్పటికే సిపిఎంతోపాటు, వామపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ప్రజలు సైతం రోడ్డెక్కితే తప్ప ప్రభుత్వాలు దిగొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. విద్యుత్, ఆర్‌టిసి ఛార్జీల పెంపు వంటివి జనాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించడం, గెలిచిన తర్వాత ప్రజలపై భారాలు మోపుతూ ప్రభుత్వాలు సామాన్యుల జీవితాలతో వికటాట్టహాసం చేస్తున్నాయి.