
అవంతీపురం జమీందారు రామేశానికి వేట మహా సరదా. ఓ రోజు ఆయన వేటకు వెళ్ళి ఏ జంతువు దొరకక నిరాశగా తిరిగివచ్చాడు. చాలాసేపు ఆలోచించి విదేశాలకు వెళ్ళాడు. అక్కడ అడవులలో ఒకజాతి కుందేళ్ళను చూశాడు. ముచ్చటపడి కొన్ని కుందేళ్ళను వెంటతెచ్చి, తన అటవీ ప్రాంతంలో వదిలాడు. అవి చాలావేగంగా పిల్లలను పెట్టి, కొద్దినెలలకే విపరీతంగా పెరిగిపోయాయి. రామేశం వేటకు లోటులేకుండా అయింది. కానీ ఆ కుందేళ్ళు అడవిలో చిన్నమొక్కలన్నీ తినడంతో అడవి పలచబడిపోయింది. మిగిలిన చిన్న జంతువులకు ఆహారం దొరకక అవి పంట పొలాలను నాశనం చేయసాగాయి. రైతులు గగ్గోలు పెట్టసాగారు. పశువులకు మేత కష్టమై, పాల దిగుబడి తగ్గిపోయింది.
కుందేళ్లు విపరీతంగా పెరిగి ఊళ్ళలోకి, ఇళ్ళలోకి రావడం మొదలుపెట్టాయి. కూరగాయల మొక్కలు, పళ్ళ మొక్కలు, తోటలు అన్నీ కుందేళ్ళ మేతకు బలయ్యాయి. జనం హాహాకారాలు చేశారు. జమీందారు కుందేళ్ళను అదుపు చేయటానికి చాలా బహుమతులు ప్రకటించాడు. ప్రజలు పెద్ద ఎత్తున కుందేళ్ళ వేట మొదలుపెట్టారు. జమీందారు వేటాడిన వారికి బహుమతిగా ధనం ఇవ్వడంతో ఖజానా అంతా కరిగిపోయి, దివాలా తీశాడు. విలాసాలకు పోయి ముప్పు తెచ్చుకోరాదని బుద్ధి తెచ్చుకుని, మామూలు బడుగు రైతులా పొలం సాగు చేసుకుని, బతకసాగాడు.
~ మంజులూరి కృష్ణ కుమారి