
ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్ : విద్యార్థులకు వేగంగా లక్ష్యాన్ని చేరుకోవడం నేర్పడం కంటే ముందు వారిని సరైన దిశలో లక్ష్యానికై పయనించడం ఎలాగో నేర్పాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో జరిగిన ఎపి ప్రయివేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల అసోసియేషన్ (అపుస్మ) సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రయివేటు పాఠశాలల యజమానులు, ఉపాద్యాయులకు, తల్లి దండ్రలుకు పలు రకాల సూచనలు చేశారు. బీటెక్, ఎంటెక్ చదివిన వారు సైతం ప్రభుత్వ శాఖల్లో అటెండర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోవడం రాష్ట్ర విద్యావ్యవస్థను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. అటు తల్లి దండ్రలు, ఇటు ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల ర్యాంకుల పైన, మార్కుల పైన పెడుతున్న శ్రద్ధ విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పాలనే కోణంలో ఆలోచించడంలేదని అన్నారు. రానున్న కాలంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అందుకోసం ప్రయివేటు పాఠశాలలు సైతం తమకు సహకరించాలని కోరారు. విద్యార్థులకు వేగంగా అభివృద్ధి చెందడం నేర్పడం కంటే ముందు వారిని సరైన దిశలో పయనించేలా దిశా నిర్దేశం చేయడం ముఖ్యమన్నారు. గత తరం పిల్లలో పోల్చుకుంటే ఈ తరం పిల్లలు ఎంతో చురుకైన వారన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ శాతం వసతులు ఉన్నయాని, అయినా తల్లిదండ్రులు ప్రయివేటుకే ఎక్కువ మక్కువ చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ప్రైవేటు పాఠశాలల ఏర్పాటుకు గతంలో ఉన్న కఠినమైన నిబంధనలను సడలిస్తామని హామీ ఇచ్చారు. ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలిపారు. అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన దుస్థితికి ఇక స్వస్థి పలకనున్నామన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన అపుస్మ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బస్సుల ట్యాక్సులు, వంటి పలు రకాల సమస్యలను ప్రస్తావించారు. ప్రధాన కార్యదర్శి కె.తులసి విష్ణుప్రసాద్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రయివేటు పాఠశాలలకు రాష్ట్రంలో అనువైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మిగిలిన సమస్యలను కూడా తమ తరుపున ఎన్నికయిన ఎమ్మెల్సీల ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానం సాధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పుట్టా సాయి శ్రావణి, ద్వితీయ స్థానం స్థానం రాజమండ్రికి చెందిన నాగసాయి నవ్యశ్రీ, మూడవ స్థానం వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన షేక్ రజితా పాతిమాలతో పాటు మరో తొమ్మది మందిని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు టి.కల్పలత, ఎం.వి.రామచంద్రారెడ్డి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎంబిఎస్.శర్మ, ఎంవి.రావు, నిషా అధ్యక్షులు కుల్బుషన్ శర్మ, కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మ, ప్రో వైస్ చాన్సలర్లు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.