ప్రజాశక్తి - కౌతాళం
శ్రావణమాస ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ జి.కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి ఛైర్మన్ నాగరాజు గౌడ్, సహాయ కమిషనర్ వాణి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి పూలమాలలతో, శాలువాతో సన్మానించారు. అనంతరం పుణ్యక్షేత్ర పరిసరాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతతో పాటు బారికేడ్లు, సిసి ఫుటేజ్ కెమెరా ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ సిసి ఫుటేజ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరిగే శ్రావణమాస ఉత్సవాల్లో స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారని తెలిపారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, శానిటేషన్, పార్కింగ్, బారికేడ్లు, బస్సు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. భక్తులకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవ సమయంలో ఎంఆర్‌పి ధరల కంటే అధిక ధరలకు అమ్మకాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అప్రమత్తంగా ఉండి ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌బి సిఐ ప్రసాద్, కోసిగి సిఐ ఎరిషావలీ, ఎస్‌ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, దేవాలయ ఛైర్మన్ నాగరాజ్ గౌడ్, సహాయ కమిషనర్ వాణి, తహశీల్దార్ రామేశ్వర రెడ్డి, దేవాలయ సూపరింటెండెంట్లు వెంకటేష్, రామ్మోహన్ పాల్గొన్నారు.
రాఘవేంద్రుని దర్శించుకున్న ఎస్పీ
మంత్రాలయం : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్రస్వామిని ఎస్పీ కృష్ణకాంత్ దర్శించుకున్నారు. శ్రీమఠం చేరుకున్న ఆయనకు శ్రీమఠం మేనేజర్ ఎస్‌కె.శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు ఆయనకు మెమొంటో అందజేశారు. ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరగనున్న రాఘవేంద్ర స్వామి సప్త రాత్రోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా వాహనాల పార్కింగ్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌బి సిఐ ప్రసాద్, సిఐ శ్రీనివాసులు, కోసిగి సిఐ ఏరిసావలీ, ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు ఉన్నారు.
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ, సబ్ కలెక్టర్










