Dec 29,2022 21:49

2 నుంచి భీమవరంలో సిఐటియు 16వ రాష్ట్ర మహాసభ
సదస్సులు, జాతాలు, వాల్‌రైటింగ్‌ ద్వారా విస్తృత ప్రచారం
2న భారీ ప్రదర్శన, బహిరంగ సభకు తరలిరానున్న అగ్రనేతలు
3, 4 తేదీల్లో ప్రతినిధుల సభలో కార్మిక, ఉద్యోగుల సమస్యలపై చర్చ
చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న ఆహ్వాన సంఘం
ప్రజాశక్తి - భీమవరం

శ్రామిక పోరాటాల రథసారధి సిఐటియు రాష్ట్ర 16వ మహాసభ జనవరి 2, 3, 4 తేదీల్లో పోరాటాల పురిటిగడ్డ, రెండో బార్డోలిగా పేరొందిన భీమవరంలో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించి ఆహ్వాన సంఘం ఆధ్వర్యాన సుమారు నెల రోజులుగా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా జనవరి 2న భీమవరంలో కార్మిక, ఉద్యోగుల భారీ ప్రదర్శన, బహిరంగ సభకు పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలతోపాటు పరిసర జిల్లాల కార్మికులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. ఈ సభలో కేరళ న్యాయ, పరిశ్రమల శాఖామంత్రి పి.రాజీవ్‌, సిఐటియు జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ కె.హేమలత, తపన్‌సేన్‌, పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జీ, సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.నర్సింగరావు, ఎంఎ.గఫూర్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా భీమవరం పాత బస్టాండ్‌ నుంచి ప్రధాన వీధుల గుండా కొత్త బస్టాండ్‌ వరకూ ప్రదర్శన సాగనుంది. అనంతరం కేశవరావు హైస్కూల్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ జరగనుంది.
మహాసభ నిర్వహణకు ఆహ్వాన సంఘం ఏర్పాటైన నాటి నుంచి చురుగ్గా ఏర్పాట్లు సాగాయి. ఒకపక్క ఏర్పాట్లు, మరోపక్క ప్రచారం రెండు జిల్లాల్లోనూ విస్తృతంగా సాగింది. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రపంచ ఆర్థిక మాంద్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు తదితర అంశాలపై భీమవరంలో రెండు సదస్సులు, తణకు, తాడేపల్లిగూడెంలో ఒక్కోటి చొప్పున సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో కార్మిక నేతలతోపాటు ఆయా పట్టణాల్లోని ప్రముఖులు, వ్యాపార సంఘాల, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు సైతం పాల్గొని మహాసభకు తమ సంఘీభావం ప్రకటించారు. కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రతీ గ్రామం, పట్టణాల్లో పెద్దఎత్తున ప్రచారం సాగింది. కార్మిక వాడల్లో గేటుమీటింగ్‌లు వంటివి నిర్వహించి మహాసభ నిర్వహణ గూర్చి కార్మికులకు నేతలు వివరించారు. వాల్‌రైటింగ్‌తోపాటు పట్టణంలో బ్యానర్లు, ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి తమదైన శైలిలో విస్తృత ప్రచారం సాగించారు. ఇక ఈ నెల 27, 28, 29 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ప్రచార జాతాలు పర్యటించి రెండో తేదీన ప్రదర్శన, బహిరంగ సభ గూర్చి జనంలో విస్తృత ప్రచారం సాగించాయి. ఇక మహాసభ ప్రారంభానికి ముందు రోజు జనవరి ఒకటో తేదీన కార్మిక, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వాల విధానాల ఫలితం, కార్మిక, ఉద్యోగులు సంఘటితం కావాల్సిన ఆవశ్యకతపై కళారూపాలు ప్రదర్శించనున్నారు. దీంతోపాటు 2న ప్రదర్శన, బహిరంగ సభతోపాటు 3, 4 తేదీల్లో జరగనున్న ప్రతినిధుల సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రదర్శన, బహిరంగ సభలో వేలాది మంది వివిధ తరగతుల కార్మికులు, జనం పాల్గొనున్నారని ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు తెలిపారు. మహాసభ విశిష్టతపై అన్ని కార్మికవాడల్లో విస్తృత ప్రచారం నిర్వహించామని, దీనికి మంచి స్పందన లభించిందని తెలిపారు. పట్టణంలో అలంకరణ పనులు ప్రారంభమయ్యాయని, మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని రారు చెప్పారు. సిఐటియు ఆవిర్భావించాక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర మహాసభ నిర్వహించడం ఇదే తొలిసారని వివరించారు. ఈ అపూర్వఘట్టంలో ఉమ్మడి జిల్లాలోని కార్మికులు, ఉద్యోగులంతా పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించాలని పిలుపునిచ్చారు.