
ప్రజాశక్తి-గుంటూరు : శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శ్రామిక మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని శ్రామిక మహిళా రాష్ట్ర నాయకులు దయా రమాదేవి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో రమాసుష్మ అధ్యక్షతన జరిగిన శ్రామిక మహిళ జిల్లా సదస్సులో రమాదేవి మాట్లాడారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళలకు ఉద్యోగ భద్రత లేకపోవటం బాధాకరమన్నారు. మహిళలు, పురుషులు కలిసి పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలనే నిబంధనను పట్టించుకోవటం దారుణమన్నారు. శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. మహిళల పట్ల వివక్షత చూపించే పనులను నిషేధించాలని, మహిళలకు జరుగు తున్న హింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలని సూచించారు. మహిళలు పనిచేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్మిక ఉద్యమ నాయకులు పర్సా సత్యనారాయణ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జరిగే బహుముఖ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో శ్రామిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సదస్సులో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షకీలా, కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఆర్.స్వాతి, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు టి.రాధా, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు అన్నమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.నేతాజి, డి.లక్ష్మీనారాయణ ప్రసంగించారు.