Oct 08,2023 23:50

ప్రజాశక్తి - బాపట్ల
అనేక రంగాల్లో  పనిచేస్తున్న శ్రామిక మహిళలకు పని భారాన్ని తగ్గించాలని
శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ రేఖ ఎలిజిబెత్  అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం జరిగిన శ్రామిక మహిళ జిల్లా సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలకు పని కాలంతో సంబంధం లేకుండా వివిధ రంగాల్లో 10 నుండి 12గంటల పాటు పని చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ యాప్‌ల పేరుతో అనేక రంగాల్లో మానసిక ఒత్తిడి గురవుతున్నారని అన్నారు. అంగన్వాడి, ఆశ, మిడ్ డే మీల్స్, పంచాయతీ, మున్సిపల్, ఆక్వా రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశాలలో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రతి సంస్థలో మహిళలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి మహిళల ఫిర్యాదులు తీసుకునే విధంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పటికీ  అనేక సంస్థల్లో అమలు కావడం లేదన్నారు. మహిళలపై వేధింపులు గురి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రామిక మహిళలకు పని భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని సదస్సు తీర్మానించింది. సదస్సుకు కుంచాల లక్ష్మి అధ్యక్షత వహించారు. సదస్సులో శ్రామిక మహిళ జిల్లా నాయకులు జి శారద, సుబ్బరావమ్మ, వెంకటలక్ష్మి, రమాదేవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్, సిఐటియు నాయకులు శామ్యూల్  పాల్గొన్నారు.