* సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, సమాన వేతనం అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో శ్రామిక మహిళా సదస్సును శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కె.నాగమణి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సదస్సులో సుబ్బరావమ్మ మాట్లాడారు. శ్రామిక మహిళలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకూ పనిభారం పెంచుతున్నాయని చెప్పారు. వారికి ఏ విధమైన కార్మిక చట్టాలూ అమలు చేయకుండా, అతి తక్కువ వేతనాలతో శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజన పథకం, విఒఎలతో పాటు అనేక పథకాల్లో, షాపులు, పలు పరిశ్రమల్లో మహిళా కార్మికులు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. అనేక పరిశ్రమల్లో, పనుల్లో సమాన వేతన చట్టం అమలు చేయడం లేదన్నారు. మహిళలు వివక్షతకు గురవుతున్నారని తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిందన్నారు. సిపిఎం మినహా ఏ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ వైఖరి వెల్లడించలేదన్నారు. పోరాటాలతోనే హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల హక్కులను కాలరాస్తోందన్నారు. మహిళలను వంట ఇంటికే పరిమితం చేయాలనే మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించడం వంటి దారుణ ఘటనలు, మారణహోమానికి కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. సదస్సు అనంతరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కో-కన్వీనర్ ఎ.మహాలక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, ఆశావర్కర్స్ యూనియన్ నాయకులు టి.దమయంతి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం కార్యదర్శి బి.ఉత్తర, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్.జ్యోతి, యునైటెడ్ బ్రేవరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు మజ్జి సూరీడమ్మ, సిఐటియు జిల్లా నాయకులు ఎన్.వి రమణ, ఎం.ఆదినారాయణ మూర్తి, అల్లు సత్యనారాయణ, శ్రామిక మహిళా నాయకులు పాల్గొన్నారు.










