
గోరంట్ల : వివిధ ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పని చేస్తున్న శ్రామిక మహిళా కార్మికుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నాయని మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి విమర్శించారు. గోరంట్ల పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో శ్రీ సత్యసాయి జిల్లా శ్రామిక మహిళ జిల్లా సదస్సును సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సదస్సులో ధనలక్ష్మితో పాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్.వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఇంతియాజ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ శ్రామిక మహిళలకు ప్రయివేటు యాజమాన్యం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో శ్రామిక మహిళలు నాలుగు లక్షల మంది వివిధ రంగాల్లో పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన అంగన్వాడీ, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, ప్రయివేటు రంగంలో గార్మెంట్స్ పరిశ్రమల్లో మహిళలు అధికంగా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రయివేటు యాజమాన్యం మహిళలకు పనిభారం ఎక్కువ పెట్టి, వేతనం తక్కువ ఇస్తోందన్నారు. ఈఎస్‌ఐ, పిఎఫ్ ప్రమాద బీమాను వర్తింజేయడం లేదని చెప్పారు. మహిళలు పనిచేసే చోట కనీస సౌకర్యాలు కూడా ఉండడం లేదన్నారు. మహిళల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఎన్నో పథకాలు పెట్టామని ప్రచారాలు చేయడం తప్పా, ఆచరణలో చేస్తున్నది శూన్యం అన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు మహిళా ఉద్యోగులు, కార్మికుల పట్ల చిన్నచూపు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్యలపై నిరసన తెలపాలని చూస్తే రాష్ట్రంలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేసి ఉద్యమాలను అణిచివేసే కుట్ర జరుగుతోందన్నారు. గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు మూడేళ్ల నుంచి వేతనాలు ఇవ్వకుండా శ్రమను దోచుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో శ్రామిక మహిళలు ప్రభుత్వాల ఆదుకోకపోవడంతో తీవ్ర సంక్షోభంలో ఉన్నారన్నారు. మహిళలకు పని భారంతో పాటు వేధింపులు అధికంగా ఉన్నాయన్నారు. శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలన్నారు. ప్రయివేటు యాజమాన్యం వేధింపులను ఆపాలన్నారు. శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం అయ్యేవరకు శ్రామిక మహిళ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామన్నారు. మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీ అంగన్వాడీ, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రయివేటు పరిశ్రమల్లో మహిళా ఉద్యోగులపై వేధింపులను నియంత్రించాలని కోరారు. ప్రభుత్వాలు స్పందించేలా శ్రామిక మహిళల సమస్యలపై దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ దిల్షాద్, నాయకులు శ్రీదేవి, సౌభాగ్య, మానస, సుబ్బమ్మ, శ్రీదేవి, మంజుల, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, పెడబల్లి బాబా, పెనుగొండ రమేష్, సాంబ, నరసింహులు పాల్గొన్నారు.