Aug 21,2023 23:24

ప్రజాశక్తి-కాకినాడ శ్రామిక మహిళల ఆర్థిక, సాంఘిక, రాజకీయ భద్రత కోసం పోరాటం చేయాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ జి.బేబీరాణి పిలుపునిచ్చారు. టీచర్స్‌ హోంలో సిఐటియు ఆధ్వర్యంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. తొలుత జిల్లా కన్వీనర్‌ జి.బేబిరాణి సిఐటియు జెండాను ఆవిష్కరించారు. విమలా రణాదివే చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా బేబిరాణి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, జిజిహెచ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు రాజు తలుపులమ్మ, జీడిపిక్కల కార్మికుల సంఘం నాయకురాలు షేక్‌ పద్మ, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు నీరజ, మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల ఈశ్వరి మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగమైన మహిళలు ఇంటిపనికే పరిమితమైతే దేశాభివద్ధి ఎలా సాధ్యమని పాలకులను ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల జిడిపిలో మహిళల భాగస్వామ్యం 45 శాతం ఉంటే, భారతదేశంలో 21 శాతంగా మాత్రమే ఉందన్నారు. కరోనా సంక్షోభంలో యాజమాన్యాలు పని చేసే మహిళలను తొలగిస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయి తప్పితే, మహిళల ఉపాధిని కాపాడే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. పనిచేసే మహిళా కార్మికులందరికీ కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతుంటే, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రోజుకు రూ.176 చొప్పున నెలకు రూ.4,576 ఇస్తే సరిపోతుందని జాతీయ కనీస వేతనాన్ని నిర్ణయించి తన మహిళా వ్యతిరేకతను చాటుకుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని మహిళలందరూ ఫాసిస్ట్‌, మనువాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడటం తప్ప మరొకమార్గం లేదన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా దేశంలోని ఏ రాజకీయపార్టీ కూడా ముందుకు రాలేదని, ఒక్క సిపిఎం మాత్రమే తమ అంగీకారాన్ని తేలిపిందని సుప్రీంకోర్టు చెప్పడాన్ని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను అన్ని స్థాయిల్లో ఏర్పాటు చేయడంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్షులు దవ్వా శేషబాబ్జి, కోశాధికారి మలకా రమణ, నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, జిల్లా వర్కింగ్‌ కమిటీ సభ్యుడు రొంగల ఈశ్వరరావు, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు భారతి, పద్మావతి, అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలం లక్ష్మీ, జిల్లా కోశాధికారి రమణమ్మ , జ్యోతి, సునీత, నాగమణి, సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభారాణి, జ్యోతి, మధ్యాహ్న భోజన సంఘం నాయకులు సుబ్బలక్ష్మి, కంటింజెంట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కె.కుమారి, జీడిపిక్కల కార్మికుల సంఘం నాయకులు జయలక్ష్మి, వరలక్ష్మి పాల్గొన్నారు.