రాయచోటి టౌన్ : 'క్విట్ ఇండియా' స్పూర్తితో మోడీని గద్దె దింపి దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో విజయవాడలో ఈనెల 9న నిర్వహించబోయే శ్రామిక జనగర్జనలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రామాంజనేయులు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఐఎఫ్‌టియు జిల్లా కన్వీనర్ విశ్వనాథ్ కోరారు. గురువారం పట్టణంలోని ఎఐటియుసి జిల్లా కార్యాలయంలో ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గ సమస్యలు తొమ్మిదేళ్ల మోడీ పాలనలో పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. కనీస వేతనం 26వేలు పెంచాలన్నా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని వాపోయారు. స్కీం వర్కర్ల శ్రమను దోచుకోవటం తప్ప వారిని పర్మినెంట్ చేయడం లేదని పేర్కొన్నారు. కీలక రంగాలతో సహా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను ప్రయివేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, 900 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగ్గడం లేదని పేర్కొన్నారు. అ సంఘటిత రంగ కార్మికులందరికీ పిఎఫ్, పెన్షన్, ఆరోగ్య సౌకర్యాలు తదితరాలతో కూడిన సామాజిక భద్రతను ఇంత వరకు ప్రకటించలేదని తెలిపారు. కాంట్రాక్ట్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2015 నుంచి త్రైపాక్షిక భారత కార్మిక మహాసభను నిర్వహించలేదని, ఈ మహాసభలు జరిగితే కార్మిక సమస్యలు చర్చలకు వస్తాయని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల ధరలు ఆకాశానికి అంటి, వేతనాలు పాతాళానికి పోతున్నాయని పేదరికం, ఆకలి, నిరుద్యోగం పెరుగుతోందని, సంపద మొత్తం కొద్ది మంది చేతుల్లో పోగుపడి ఆర్ధిక సంక్షోభాలకు దారి తీస్తోందన్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితే కార్మికులకే కాక రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివత్తిదారులు తదితర శ్రామికులందరికీ తీవ్రమైన నష్టం వస్తుందని అన్నారు. కార్మికుల మద్దతుతో చేసిన రైతుల పోరాటానికి తలొగ్గి నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ, రైతులకు మోడీ చేసిన వాగ్దానాలు ఇంత వరకు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలక వైసిపి, ప్రతిపక్ష టిడిపి ఎంపీలు పార్లమెంట్‌లో రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను బలపర్చారని మైనార్టీలపై, సామాజిక తరగతులపై సంఘపరివారం చేస్తున్న దాడులపై వైసిపి, టిడిపి, జనసేనలు నోరు విప్పటంలేదని చెప్పారు. ఈ నెల 9న విజయవాడలో నిర్వహించే శ్రామిక జన గర్జనలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు అల్లబకష్, రెడ్డయ్య, ఎపొ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుతు నేలపాటి శ్రీనివాసులు, ఎఐటియుసి రాయచోటి పట్టణ కార్యదర్శి పుల్లయ్య, రమణ పాల్గొన్నారు.










