ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
సమాజంలో సగభాగమైన శ్రామిక మహిళల హక్కులకు ఐక్యఉద్యమాలకు సిద్ధం కావాలని శ్రామిక మహిళ సమన్వయ కమిటీ (సిఐటియు) రాష్ట్ర నాయకురాలు డి.రమాదేవి పిలుపునిచ్చారు. ఏలూరు సిఐటియు జిల్లా ఆఫీసులో ఆదివారం జరిగిన శ్రామిక మహిళా జిల్లా సదస్సులో దయా రమాదేవి మాట్లాడారు. సమాజంలో సగభాగమైన మహిళలకు నేటికీ సమాన వేతనాలు అమలు కావడం లేదని, దీనికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. పని ప్రదేశాల్లో ప్రభుత్వ, ప్రయివేటు అనే తేడాలు లేకుండా అనేక చోట్ల మహిళల వేధింపులకు గురవుతున్నారని, మహిళలపై జరుగుతున్న వేధింపులు, హింసను అరికట్టేందుకు లైంగిక వేధింపుల ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అనేక సేవలందిస్తున్న ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథం, మెప్మా, వర్కర్లను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని కోరారు. పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి చెందుతున్న షాప్స్ అండ్ మాల్స్, ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళలు కూరుని పనిచేసే విధంగా, కేరళ తమిళనాడు తరహా సీట్ అండ్ వర్క్ చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ కార్యదర్శి కె.సుభాషిణి, సుధారాణి దుర్గాంబ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రయివేటురంగాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళలకు వేతనంతో కూడిన మేటర్నిటీ సెలవులను కల్పించాలని, పని ప్రదేశాల్లో తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, మహిళలకు కనీస సౌకర్యాలను కల్పించని సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోసమ్మ మాట్లాడుతూ ఇంటిపనివారుగా పనిచేస్తున్న మహిళలకు వారాంతపు సెలవు ఇవ్వాలని, యజమానుల నుండి రక్షణ కల్పించాలని, ఇంటి పనివారల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. వీధి వ్యాపారులకు సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలను అందించా లని పోలీసులు, మున్సిపల్, పంచాయతీ అధికారుల వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి శ్రామిక మహిళలు పెద్దఎత్తున సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సుకు ఎం.నాగమణి, చెల్లెమ్మ, పి.వెం కటరమణ అధ్యక్షత వహించారు. శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ కె.విజయలక్ష్మి రిపోర్టును ప్రవేశపెట్టారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆర్.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న శ్రామిక మహిళలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ స్కూల్స్‌లో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లకు నేటికీ అరకొర జీతాలే ఇస్తున్నారని, కనీస వేతనాలు అమలు చేసి, వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సుకు ఎస్‌కె.సుభాషిణి స్వాగతం పలికారు. ఈ సదస్సులో నాయకులు బిజె ఎం.కుమారి, మాణిక్యం, రాజకుమారి, ఆదిలక్ష్మి, హైమావతి, కామేశ్వరి, మేరీ, లక్ష్మి, సరోజని పాల్గొన్నారు.










