Nov 30,2022 23:50

మత్స్యకారుల ధర్నా

ప్రజాశక్తి- నక్కపల్లి:హెటిరో పైపులైన్‌ కు వ్యతిరేకంగా మత్స్యకారుల తలపెట్టిన ఉద్యమం స్పూర్తిదాయకంగా కొనసాగుతుంది. పైపులైన్కు వ్యతిరేకంగా మత్స్యకార జెఎసి అధ్వర్యంలో చేపట్టిన శాంతియుత మహాధర్నా ఈనెల 1వ తేదీతో 365 రోజులకు చేరుకున్నాయి. రాజయ్య పేట సమీపంలో హెటిరో డ్రగ్స్‌ కంపెనీని 2007 సంవత్సరంలో ఏర్పాటు చేసారు. కంపెనీ రసాయన వ్యర్ధ జలాలలను పైపులైన్‌ ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. కంపెనీ వ్యర్ధ జలాలు సముద్రంలోకి వదలడంతో ఈ ప్రాంతంలో మత్స్య సంపద సేశించిపోయిందని, ఉపాధి లేకుండా పోయిందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. అదే విధంగా కంపెనీ నుండి వెలువడే కాలుష్యం కారణంగా అనేక రోగాల బారిన పడుతున్నామని మత్స్యకారుల ఆవేదన. కంపెనీ యాజమాన్యం 2021 నవంబర్‌ నెలలలో 3 అడుగుల వైశాల్యంతో కొత్తగా మరో పైపులైన్‌ వేసారు. దీంతో మత్స్య కారులంతా, పైపులైన్కు వ్యతిరేకంగా పోరాటం. ప్రారంభించారు. ఇప్పటికే వేసిన పైపులైన్‌ వల్ల ఉపాధి కోల్పోవడం జరిగిందని, కొత్తగా పైపులైన్‌ వస్తే తమ ఉనికికే ప్రమాదమని మత్యకారులు ఆందోళన బాట పట్టారు. 2021 డిశంబర్‌ 1 నుంచి కొత్తగా వేస్తున్న పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్యకారులు శాంతియుత మహా ధర్నా చేపట్టారు. దీంతో కంపెనీ యాజమాన్యం కొత్తగా వేస్తున్న పైపులైన్‌ పనులు నిలుపుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో కూడా పైపులైన్‌ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకూడదని మత్స్యకారుల ప్రధాన డిమాండ్‌తో ఆందోళన కొనసాగిస్తున్నారు. 2021 డిశంబర్‌ 6న రాజయ్య పేట నుంచి నక్కపల్లి తహశీల్దార్‌ కార్యాలయం వరకు పైపులైన్కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేదని పోలీసు నివారించారు. అనేక ఆటంకాలు ఎదురైనా మత్స్యకారులు పట్టువీడని విక్రమార్కులా ఆందోళన కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదన్న ఉద్దేశ్యంతో న్యాయ పోరాటం చేస్తున్నారు. చెన్నైలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ లో కేసు వేయడంతో వారు వివిధ విభాగాల్లో ముఖ్యమైన అధికారులతో అత్యుస్నత కమిటిని నియమించారు. కమిటి 2022 మార్చి నెలలో ఈప్రాంతంతో పర్యటించి మత్స్యకారుల నుంచి వివరాలు సేకరించారు. అఖిల పక్ష పార్టీల నాయకులు కూడా మత్స్యకారులు తలపట్టిన పోరాటానికి మద్దత్తు ప్రకటించారు. సిపిఎం మరో అడుగు ముందుకు 'వేసి మత్స్యకారులు చేపట్టిన ఆందోళనలో పాల్గొని, మత్స్యకారులకు న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు ప్రకటించారు. మత్స్యకారులు చేపట్టిన శాంతియుత మహాధర్నా నేటికి 365 రోజులకు చేరుకోవడంతో మత్స్యకారుల సింహా గర్జన పేరిట గురువారం శిభిరం వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మత్స్యకారులు ప్రకటించారు.