ప్రజాశక్తి - ఏలూరు
ప్రపంచ విప్లవ వీరుడు చేగువేరా 95వ జయంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఎం నగర కార్యదర్శి పి.కిషోర్ అధ్యక్షతన జరిగిన సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ ప్రపంచ విప్లవకారుడు, క్యూబా విప్లవ నేత చేగువేరా వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ క్యూబాలో ప్రజల దోపిడీకి వ్యతిరేకంగా తన మిత్రుడు ఫెడల్ కాస్ట్రోతో కలిసి పోరాడి విప్లవం సాధించిన నేత అని కొనియాడారు. ప్రపంచంలో దోపిడీకి గురవుతున్న ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారని, దానికి సోషలిస్టు సమాజం మార్గమని అన్నారు. చేగువేరా క్యూబాలో విప్లవం సాధించిన తర్వాత అక్కడితో తన పోరాటాన్ని ఆపకుండా పక్కనే ఉన్న బొలివియా దేశంలో కూడా ప్రజలను దోపిడీ నుండి విముక్తి చేసేందుకు తన పోరాటాన్ని కొనసాగించాడన్నారు. ప్రపంచంలో చేగువేరా అంటే యువతకు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. మన దేశంలో, రాష్ట్రంలో కొన్ని బూర్జువా పార్టీలు చేగువేరా బొమ్మ పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అటువంటివారు చేగువేరా ఏ ఆశయాల కోసం పోరాడాడో ముందు తెలుసుకోవాలని హితవు పలికారు. చేగువేరా ఆశయాలు తెలియకుండా ఆయన ఫొటోలతో ప్రచారం చేసుకోవడం ఆత్మవంచనే అవుతుందన్నారు. చేగువేరా ఆశించిన సమ సమాజం మన భారత దేశంలో తీసుకురావడం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. మన దేశంలోని లౌకిక రాజ్యాంగాన్ని మత రాజ్యాంగంగా మార్చాలని బిజెపి మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బిజెపి ప్రభుత్వ మతోన్మాద, కార్పొరేట్ సంస్థ అనుకూల ప్రజావ్యతిరేక విధానాలను చేగువేరా పోరాట స్ఫూర్తితో తిప్పికొట్టాలని రవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి.సాయిబాబు, పి.సూర్యారావు, జె.గోపీ, ఎం.ఇస్సాక్, మీసాల సత్యనారాయణ, సింహాచలం, ఆర్.నరసింహమూర్తి, బి.త్రినాధ్, వై.సీతారాం పాల్గొన్నారు.
ఏలూరు: చేగువేరా తరతరాలు గుర్తుంచుకునే గొప్ప ఆదర్శ నాయకుడు అని ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు వి.సురేష్ అన్నారు. స్థానిక అన్నే భవనంలో చేగువేరా 95వ జయంతి సందర్భంగా సభ నిర్వహించారు. సభకు జి.సురేష్ ఆహ్వానం పలికారు. వి.సురేష్ అధ్యక్షత వహించారు. తొలుత చేగువేరా చిత్రపటానికి విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు పి.పరమేశ్వరరావు, విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేగువేరా జీవిత విశేషాల ఆడియో వినిపించారు. సభాధ్యక్షులు సురేష్, విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడారు. కార్యక్రమంలో ఏలూరు సన్‌రైజ్ లయన్స్ క్లబ్ తరపున విజ్ఞాన కేంద్రానికి ఇచ్చిన బ్లాక్ అండ్ వైట్ బోర్డును లయన్స్ క్లబ్ అధ్యక్షులు వి.సురేష్ కమిటీ సభ్యులకు అందించారు. డాక్టర్ రావిగోపాలకృష్ణయ్య అందించిన సాహిత్యం, పి.పరమేశ్వరరావు అందించిన సాహిత్యం బుక్‌బ్యాంక్‌కు స్వీకరించారు. సభలో కె.శ్రీనివాస్, ఎం.లక్ష్మి, సిహెచ్.జగదీష్, దుర్గా ప్రసాద్, రామ్ కుమార్, సాయి మాట్లాడారు.
జంగారెడ్డిగూడెం :ప్రపంచ విప్లవ యోధుడు చే గువేరా స్ఫూర్తితో ఆయన ఆశయసాధనకు యువత ముందుకు సాగాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్ అన్నారు. బుధవారం డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేగువేరా జయంతిని మైసన్నగూడెంలో ఘనంగా నిర్వహించారు. తొలుత చే గువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళి విముక్తికి భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా అమెరికన్ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా ఆఖరి క్షణం వరకూ పోరాడిన ధీరుడు చే గువెరా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి వెంకటసుబ్బారావు, పోతురాజు, నాగేంద్ర, పి.దుర్గారావు పాల్గొన్నారు.










