ప్రజాశక్తి పాడేరు :
అల్లూరి సీతారామరాజు జిల్లా సిఐటియు ప్రథమ మహాసభలు దిగ్విజయంగా ముగిశాయి. మంగళ, బుధవారాల్లో పాడేరులో మోదకొండమ్మ కళ్యాణ మండపంలో జరిగిన ఈ మహాసభ ప్రతినిధులకు స్ఫూర్తినిచ్చింది. రాబోయే కాలంలో చేపట్టబోయే పోరాటాలకు మహాసభ దిశానిర్దేశం చేసింది. గత పోరాటానుభవాలను పంచుకున్నారు. కర్తవ్యాలు రూపొందిం చుకున్నారు.
మహాసభ ముగింపు సందర్భంగా బుధవారం సిఐటియు జిల్లా ప్రతినిధుల సభలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలతోనే విశాల కార్మిక ఉద్యమం నిర్మించడానికి వేదిక కానుందని, పోరాటాలతోనే కార్మిక హక్కులు రక్షణకు సాధ్యమౌతుందని అన్నారు. కార్మికుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి కార్మిక హక్కులను హరించే కుట్రపూరితమైన వైఖరిపై విశాలమైన ఉద్యమ వేదికకు కార్మికవర్గానికి సమీకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన వాక్కు స్వాతంత్య్రాన్ని కూడా కాలరాస్తూ మనువాద విధానాన్ని ప్రజల్లో బలవంతంగా రుద్దాలని కేంద్ర ప్రభుత్వ ప్రణాళికను విచ్ఛిన్నం చేయగల శక్తి, సామర్థ్యం కార్మిక వర్గానికే ఉందని అన్నారు. జిల్లాలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రిజర్వేషన్ కల్పించే జిఓ నెం 3ను రద్దు చేసి మూడేళ్లు కావస్తున్నా పునరుద్ధరించకపోవడంతో యువతీ యువకులు అసాంఘిక శక్తులుగా మారుతున్నారన్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను రక్షించుకోవడం ద్వారా సామాజిక న్యాయం సాధన సాధ్యమని, ప్రైవేట్ రంగ పరిశ్రమల్లో కూడా రిజర్వేషన్లు అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరిట గిరిజన అటవీ ప్రాంతాన్ని కార్పొరేట్‌కు అప్పగించే కేంద్ర, ప్రభుత్వాల గిరిజన వ్యతిరేక విధానాలపై కూడా గిరిజనుల్లో చైతన్యం తీసుకురావాలని ప్రతినిధులను కోరారు. ప్రజల్లో పెరుగుతున్న అశాంతిని దారి మళ్ళించడానికి లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మత విద్వేషాలు, కుల వైషమ్యాలు రెచ్చగొట్టి కార్మిక పోరాటాన్ని విచ్ఛిన్నం చేయాలనే పాలకవర్గాల నైజాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. కార్మిక, ప్రజా పోరాటాలపై నిర్బంధం పెరిగిందని వాటిని ఎదుర్కొని ఉద్యమం నిర్మించడం ద్వారానే సంఘం బలోపేతానికి దోహదం చేస్తుందన్నారు.
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.బేబి రాణి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా యాప్‌ల పేరుతో అంగన్వాడీ, ఆశా, మిడ్డేమీల్స్ కార్మికులపై అధికారుల వేధింపులు అధికమయ్యాయని తెలిపారు. శ్రామిక మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్డ్ రంగాల కార్మికులకు కనీస వేతనం రూ.26వేల వేతనం ప్రభుత్వం చెల్లించాలని, ఆ దిశగా కార్మిక ఉద్యమం నిర్మించాలని కోరారు.
గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ గిరిజన సమస్యలపై నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమానికి కార్మికవర్గం మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి వి.మహేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కిల్లో ప్రభుదాస్ సౌహర్ధ సందేశాన్ని ఇచ్చారు. ఈ మహాసభలో జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు నివేదిక ప్రవేశపెట్టగా 11 మండలాల నుండి మరియు 16 రంగాల నుండి కార్యదర్శి నివేదికపై చర్చించి నివేదిక ఇచ్చారు. అధ్యక్షవర్గంగా బోనంగి చిన్నయ్యపడాల్, శెట్టి నాగరాజు, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వ్యహరించగా మహాసభలో 19 రకాల సమస్యలపై తీర్మానాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు పి. బాలదేవ్ ప్రవేశపెట్టగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు, సిఐటియు జిల్లా నాయకులు మంగమ్మ, బుజ్జిబాబు, పోతురాజు, సుందరరావు, గిరిజన సంఘం నాయకులు సోమేలి చిట్టిబాబు, సత్యనారాయణ, జిల్లా నలుమూలల నుండి హాజరైన 200 మంది ప్రతినిధులు పాల్గొని మహసభను విజయవంతం చేశారు.










