
భూమి కోసం.. భుక్తి కోసం ఈ ప్రాంతంలో ప్రతి దిక్కు నినదించింది. సిక్కోలులో 1960 దశకంలో దిక్కులు పిక్కటిల్లేలా 56 ఏళ్ల క్రితం ఇదే రోజున శ్రీకాకుళ రైతాంగ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ ఉద్యమం గిరిజన గూడేలంతటా విస్తరించింది. క్రమంగా గిరిజనులకు పలుహక్కులు సంక్రమించాయి. మంగళవారం కోరన్న, మంగన్న 56వ వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
ప్రజాశక్తి-కురుపాం/గుమ్మలక్ష్మీపురం
వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం... దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములకు వ్యతిరేకంగా 1967 అక్టోబర్ 31న మొండెంఖల్‌లో కమ్యూనిస్టు పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు విద్యార్థులు, మహిళలు, గిరిజనులు పిల్లాపాపలతో సభకు వెళ్తున్నారు. ఈ సభను భగం చేయాలని పలువురు భూస్వాములు పి.లేవిడి వద్ద ఆదివాసీలపై దాడులు చేశారు. ఆనాటి భూస్వాముల కాల్పుల్లో ఇద్దరు ఆదివాసీ యువకులు మరణించారు. వారే శ్రీకాకుళం గిరిజన రైతాంగ ఉద్యమం తొలి అమరవీరులు ఆరిక కోరన్న, కొండగొర్రె మంగన్న. విజయనగరం జిల్లాలోని కొంత ప్రాంతం అనాటి శ్రీకాకుళం జిల్లాలో ఉండేది. ఇందులో అధిక శాతం భూమి జమీందారులు, సంస్థానాధీశుల ఆధీనంలో ఉండేది. ఆదివాసీలకు అక్షర జ్ఞానం లేక అంకెలు తెలియకపోవడంతో భూస్వాముల దోపిడీకి వరంగా మారింది. భూస్వాముల వెట్టిచాకిరీ నుంచి గిరిజనులకు విముక్తి కల్పించడానికి పలు పోరాటాలు జరిగాయి. గిరిజనులను చైతన్య పరచడానికి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గిరిజన సంఘం ఏర్పాటు చేసి ఉద్యమాలకు ఊపిరి పోశారు. పల్లెరక రాములు, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం తదితరులు ముందుండి ఉద్యమాలను నడిపించారు. 1971 వరకు వివిధ దశల్లో ఉద్యమాలు జరిగాయి. వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం పోలీసు తూటాలకు బలైపోయారు. ఆరిక గుంపస్వామి, కొండగొర్రె లచ్చన్న, కృష్ణమూర్తి, శ్రీరాములు, వసంత, రఘు, రాములు తదితరులు జైలుపాలయ్యారు. ఆనాటి ఉద్యమకారులు త్యాగఫలంగా గానే ఐటిడిఎ, జిసిసి ఏర్పాటయ్యాయి. గిరిజనులకు అటవీ హక్కుల చట్టం వచ్చింది.
హక్కులను కాలరాసేందుకు కుట్ర
పోరాట ఫలితంగా గిరిజనులు సాధించుకున్న హక్కులను నేటి పాలకులు కాల రాయడానికి కుట్రలు చేస్తూనే ఉన్నారు. కేంద్రంలోని మతోన్మాద బిజెపి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి అడవి తల్లి ఒడిలో బతుకుతున్న గిరిజనులను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు కుట్రలు పన్నింది. ఏజెన్సీలో ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యాన పోరాటాలు చేసి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నాయి. యుపిఎ హయాంలో వామపక్షాల చొరవతో వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాల్సిన బిజెపి ప్రభుత్వం ఆ చట్టాన్ని నీరుగార్చే చర్యలకు ఒడిగట్టింది. అడవిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు భూములపై హక్కులు లేకుండా చేయాలని చూస్తోంది.
నేడు మామిడిమానుగూడలో కోరన్న, మంగన్న వర్థంతి
సభ నీలకంఠాపురం పంచాయతీ మామిడిమానుగూడలో మంగళవారం శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట అమర వీరులు కోరన్న, మంగన్నల 56వ వర్ధంతి సభ నిర్వహిస్తున్నామని, జిల్లాలోని ఆదివాసీ గిరిజనులంతా పాల్గొని జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు బిడ్డిక వెంకటరావు, బిడ్డిక నాగేశ్వరరావు కోరారు.