Aug 14,2023 21:50

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ పిపి వావా

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : సఫాయి కర్మచారుల సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు బాధ్యతతో, సమిష్టిగా కృషి చేయాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ పిపి.వావా అన్నారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మున్సిపల్‌ అధికారులు, సఫాయి కర్మచారి సంఘాల ప్రతినిధులు, పారిశుధ్య కార్మికులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. దేశంలో మాన్యువల్‌ స్కావెంజర్‌ను పూర్తిగా నిషేదిస్తూ 2013లో ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ఎంప్లారుమెంట్‌ యాజ్‌ మాన్యువల్‌ స్కావెంజర్స్‌ అండ్‌ దెయిర్‌ రిహాబిలిటేషన్‌ యాక్ట్‌ అమల్లోకి తెచ్చారన్నారు. మాన్యువల్‌ స్కావెంజర్‌పై ఆధారపడి జీవిస్తున్న సఫాయి కర్మచారుల ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి ద్వారా హామీలేని రుణాలు అందిస్తుందని, వారి పిల్లలకు ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ తరగతి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందించటంతో పాటు, అడ్మిషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుందని తెలిపారు. సఫాయి కర్మచారులకు కనీస వేతనాలు, రక్షణ పరికరాలు ఇవ్వాలని, నేరుగా డ్రెయినేజి పనులు చేయించొద్దని, డ్రెయినేజీల శుభ్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీని వినియోగించుకొని స్కావెంజర్‌ యంత్రాలను సమకూర్చుకోవాలని చెప్పారు. గుంటూరు మున్సిపల్‌ కార్పోరేషన్‌ శానిటేషన్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు సోమి శంకరరావు, ది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మున్సిపల్‌ ఇంజినీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఇ.మధుబాబు, ది గుంటూరు జిల్లా మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.ముత్యాలరావు, పారిశుధ్య పనివారల సంఘం అధ్యక్షులు మరియన్న, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు కె.మాల్యాద్రి తదితర కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు ఎక్కువుగా నిరక్షరాస్యులు ఉండటం వలన ఇపిఎఫ్‌ ఖాతాలకు సంబంధించి పుట్టిన తేదీ, ఆధార్‌ కార్డుల సవరణ వలన రుణాలు, సెటిల్మెంట్‌ క్లైయిమ్‌లు దీర్ఘకాలంగా పెండింగ్‌ ఉన్నాయాన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల వ్యక్తిగత అవసరాలకు బ్యాంక్‌ రుణాలు ఇప్పించాలని, గుంటూరులో ఇఎస్‌ఐ హాస్పిటల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన పారిశుధ్య కార్మికుల్లో 650 మందిని తొలగించారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పర్మినెంట్‌ కార్మికుల బేసిక్‌ పే, డీఏతో కలపి కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు అమలు చేయాలని, పారిశుధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, యూనియన్‌ కార్యాలయాలకు స్థల కేటాయించాలని వినతి పత్రాలు అందజేశారు. కార్మికులు ఎక్కువ మంది ఇపిఎఫ్‌ అంశంపై ఫిర్యాదు చేశారని, సంబంధిత అధికారులతో జిఎంసి అధికారులు మాట్లాడాలని త్వరలో జాతీయ స్థాయిలో పిఎఫ్‌ విభాగ అధికారుల దృష్టికి కూడా సమస్య తీసుకెళ్తామని వావా తెలిపారు. మరో 15 రోజుల్లో ప్రతి కార్మికునికి పిఎఫ్‌, ఇఎస్‌ఐ నంబర్‌తో కూడిన ఐడి కార్డ్‌లు అందించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.
జిల్లా అధికారులతో సమీక్ష
సఫాయి కర్మచారీలు సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలపై కలెక్టరేట్‌లో వావా సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ల పథకం కింద అర్హులకు స్థలాలిచ్చి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటకీ పొందనివారుంటే సమీప సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, నిబంధనల మేరకు 90 రోజుల్లో ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. సమీక్షలో ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌, జెసి జి.రాజకుమారి, నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్‌ పి.రోజా, సఫాయి కర్మచారి కమిషన్‌ సభ్యుల సలహాదారు వీరేంద్రనాథ్‌, డీఆర్‌ఓ కెసి.చంద్రశేఖరరావు, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ మధుసూదనరావు, గుంటూరు ఆర్డీఓ ప్రభాకరరెడ్డి, మున్సిపల్‌ ఆర్‌డి శ్రీనివాసులు, బీసీ కార్పొరేషన్‌ ఇడి దుర్గాబాయి, డిఇఒ శైలజ, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ శ్రావణబాబు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ హనుమంతరావు, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ జయరామకృష్ణ పాల్గొన్నారు.