Aug 18,2023 23:44

ప్రజాశక్తి-కాకినాడ సఫాయి కర్మచారీలు సామాజికంగా, ఆర్థికంగా అభివద్ధి చెందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్‌ సభ్యుడు డాక్టర్‌ పిపి.వారా కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌,లో జెసి ఎస్‌.ఇలక్కియ, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి.రమణమూర్తి, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసింహారావు తదితరులతో కలిసి ఆయన సమీక్షించారు. మున్సిసిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, నగరపంచాయతీలు, గ్రామ పంచాయతీల స్థాయిలో పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల పురోగతిని పరిశీలించారు. సాంఘిక సంక్షేమం, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, వైద్య ఆరోగ్యం, కార్మిక, పోలీస్‌ తదితర శాఖల అధికారులతో పాటు జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులతో చర్చించారు. అసమానతలు లేకుండా సఫాయి కార్మికులు అన్ని విధాలా ఎదిగేందుకు వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడంతో పాటు జీవన ప్రమాణాలు పెంచేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. దేశానికి, సమాజానికి పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను గుర్తించి వారికి సుస్థిర ఉపాధి, ఆరోగ్య భద్రత కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. రుణ సదుపాయాలతో పాటు పనిచేసే చోట భద్రత కల్పించేలా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన పనిముట్లు, రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డోకుబుర్ర భద్రం, డాక్టర్‌ మోకా పవన్‌ కుమార్‌, బండి వీరలింగేశ్వరరావు, గంగవంశం త్రినాథ్‌దేవ్‌, పిల్లి జ్యోతి పాల్గొన్నారు.
కార్మికుల గోడు వినని కమిషన్‌
సఫాయి కర్మచారీ జాతీయ కమిషన్‌ సమావేశంలో కార్మికుల గోడు పూర్తిగా వినలేదని సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు విమర్శించారు. సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ అధికారుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులు జోక్యం చేసుకుంటూ అన్నీ రాసి ఇవ్వండి అంటూ ఆపేయడం సమంజసంగా లేదన్నారు. చాలా చోట్ల కనీస వేతనాలు అమలు కావడం లేదని, డిపిఒ సర్క్యులర్‌ ఇచ్చినా కార్మికులకు పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయడం లేదన్నారు. ఆదివారం కూడా సెలవు అమలు చేయడం లేదన్నారు. శానిటేషన్‌ వర్కర్స్‌కు హెల్త్‌ అలవెన్సు ఇవ్వడం లేదన్నారు. కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పన చాలా ఆలస్యం అవుతోందన్నారు.