సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీ చాంబర్లు ఖాళీ చేస్తూనో, మురికి కాలువల్లో పూడిక తీస్తూనో, దేశంలో రోజూ ఏదో ఒక చోట పారిశుధ్య కార్మికులు చనిపోతున్నప్పటికీ, మీడియాలో పెద్దగా వార్తలు కావడం లేదు. అధికార వ్యవస్థలకు పట్టింపుగా లేదు. పౌర సమాజం మొద్దుబారిపోయింది. బాధితులంతా నిరుపేదలు, నిరక్షరాస్యులు, దళితులు కావడం వల్ల, వీరిపై ఎడతెగని, అంతులేని వివక్షలు వ్యవస్థీకృతంగా సాగుతున్నాయి.
హైదరాబాద్ లో డ్రైనేజీ పూడికతీత పనుల ప్రమాదంలో ఇటీవల ఇద్దరు సఫాయి కార్మికులు మృతి చెందిన ప్రాంతాన్ని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ వైస్ చైర్మన్, కమిషన్ సభ్యులు పరిశీలించారు. చేతులతో పారిశుధ్య పనులు చేయడంపై జాతీయ స్థాయిలో నిషేధం ఉన్నప్పటికీ, పనులు చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారని జిహెచ్‌ఎంసి అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా సంబంధిత కాంట్రాక్టర్ రాత్రివేళల్లో పని చేయించడం నిబంధ నలకు విరుద్ధమని, ఇలా చేయించడం మరింత నేరమన్నారు.
ఏ దేశమూ తన ప్రజలను చావు కోసం, విష వాయువుల గదుల్లోకి పంపదు. కానీ, మన దేశంలో ప్రతి నెలా నలుగురైదుగురు కార్మికులు పారిశుధ్య పనుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, 2019 సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జాతీయ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 2018లో 14 రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన సర్వే ప్రకారం మన దేశంలో 87,913 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నట్టు వెల్లడయింది. కాగా, కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2020కి ముందు 27 ఏళ్లలో, దేశంలో 1013 మంది సఫాయి కార్మికులు చనిపోయారు. ఈ కేసులను పరిశీలిస్తే 462 కేసుల్లో మాత్రమే ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేవలం 418 కేసుల్లో మాత్రమే భారత శిక్షా స్మృతి లోని 304 సెక్షన్ (నిర్లక్ష్యం వల్ల చనిపోవడం) కింద కేసులు నమోదైనాయి. 44 కేసులు యాక్సిడెంట్ చావుల కింద నమోదయ్యాయి.
చేతితో పారిశుధ్య పనులు చేయడాన్ని నిషేధిస్తూ, భారత పార్లమెంటు 2013లో చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం, ప్రమాదకరమైన సెప్టిక్ ట్యాంకులు, మురికి కాలవల్లో, డ్రైనేజీ చాంబర్లలో... స్థానిక అధికారులుగానీ, వ్యక్తులు గానీ, ప్రభుత్వంగానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పని చేయించడం శిక్షార్హమైన నేరం. ఇలాంటి నేరానికి పాల్పడినందుకు రెండేళ్ళ వరకూ జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల వరకూ జరిమానా లేదా రెండూ విధించవచ్చునని ఈ చట్టం చెబుతున్నది.
2020 డిసెంబర్ 31కి ముందు గడిచిన ఐదేళ్లలో, దేశంలో మొత్తం 340 మంది సఫాయి కార్మికులు చనిపోయినట్లు ఫిబ్రవరి 2న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కి తెలియజేసింది. అయితే జులై 28న రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖా మంత్రి సమాధానమిస్తూ, గడిచిన ఐదేళ్లలో దేశంలో సఫాయి కార్మికుల మరణాలు ఎక్కడా సంభవించినట్టు తమకు ఎటువంటి నివేదికలు అందలేదని తెలిపారు.
2018లో రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, జాతీయ సఫాయి కర్మచారి ఆందోళన్ కన్వీనర్ బెజవాడ విల్సన్ తెలిపిన వివరాల ప్రకారం, 2016 నుంచి 2020 వరకు, దేశంలో 472 మంది సఫాయి కార్మికులు మరణించారు. 2021లో 26 మంది చనిపోయారు. అసలు ఇలా చనిపోవడమే పెద్ద అమానుషం. ఆ వివరాలను వెలుగు లోకి రాకుండా వాస్తవ సంఖ్యలను ప్రభుత్వాలు తగ్గించి చూపడం ఇంకా అమానుషమని బెజవాడ విల్సన్ అన్నారు. ఫిబ్రవరి 2న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కి ఇచ్చిన సమాధానం ప్రకారం, 2016-2020 మధ్య కాలంలో తెలంగాణలో పారిశుధ్య కార్మికుల మరణాలు నాలుగు జరిగాయి. సఫాయి కర్మచారి ఆందోళన్ ప్రకారం ఏడు జరిగాయి.
'సఫాయి కర్మచారి ఆందోళన్' తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సరస్వతి అంచనా ప్రకారం హైదరాబాద్‌లో కనీసం 1800 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. సఫాయి కార్మికులు చేత్తో చేసే పారిశుధ్య పనిని, మానవ రహితంగా నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి ఇటీవల యాంత్రికీకరణను ప్రారంభించింది. ఇందులో భాగంగా 130 యంత్రాలను ప్రవేశ పెట్టింది. ఒక్కొక్క మిషన్ ఖరీదు 40 లక్షల రూపాయలు. దళిత చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీస్ (డిక్కి) సహాయంతో పది శాతం డౌన్‌పేమెంట్‌తో, గతంలో సఫాయి పని చేసిన వారు 50 మిషన్లను పొందగలిగారు. యంత్రాలకు యజమా నులమైనా, మళ్ళీ అదే మురికి పని పరిస్థితుల్లోనే తాము ఉండిపో వాల్సి వస్తున్నదని ఈ 'దళిత పారిశ్రామికవేత్తలు' వాపోతున్నారు.
సెప్టిక్ ట్యాంకులను మనుషులు శుభ్రం చేయడానికి వీలుగా వుండవు. ఈ సమస్యను స్వచ్ఛ భారత్ కార్యక్రమం సైతం పట్టించుకోలేదు. 2015లో సఫాయి కార్మికుల పని పరిస్థితుల మీద సర్వే చేసినప్పుడు, దుర్గంధ వాయువుల నుంచి పారిశుధ్య కార్మికులను రక్షించుకోడానికి చేతి రుమాళ్లు సరిపోతాయని సంబంధిత కాంట్రాక్టర్లు కొందరు అనడం ఎంతో అన్యాయం. విడ్డూరం. పారిశుధ్య కార్మికులు చనిపోయినప్పుడు ప్రభుత్వాలు నేరుగా బాధ్యత వహించడం లేదు. ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్ మీదకు బాధ్యతను నెట్టివేస్తున్నది. మృతి చెందిన సఫాయి కార్మికుడు 'పని లోకి రాకుండా పారిపోయాడ'ని అబద్ధమాడి సదరు కాంట్రాక్టర్ తప్పించుకోవాలని చూస్తాడు!
దేశంలో పారిశుధ్య పనుల్లో ఉన్నది తొంభై అయిదు శాతం దళితులే. ఐదు శాతం మంది ఆదివాసులు ఉన్నారు. నిజానికి సఫాయి వృత్తి కులంతో ముడిపడి ఉన్నది. కొన్ని సాంఘిక సమూహాలను పారిశుధ్య వృత్తి లోకి నెట్టివేయడమనేది ఆధిపత్య కుల వ్యవస్థ హీన రూపమే. సమాజం మల మూత్రాల మురికి కాల్వగా మారితే, శుద్ధి చేసేది మాన్యువల్ స్కావెంజర్లు. సమాజం చెత్త కుప్పగా, కుప్ప తొట్టిగా మారితే, రోగాల బారిన పడకుండా శుభ్రం చేసిన వాస్తవ స్వచ్ఛ సైనికులు వారు. యాచక వృత్తిలో ఉన్న వారిని సమాజం ముట్టుకుంటుంది. కొండొకచో గౌరవిస్తుంది. కానీ పాకీ వృత్తిదారులను, సమాజం అంటరాని వారికి అంటరానివారిగా పరిగణిస్తున్నది. ఇది చాలా అసాంఘికమైనది. అన్యాయమైనది. వారి జీవితాలకు అంటిస్తున్న పంకిలాన్ని ఇప్పటికైనా మానుకోవాలి. సఫాయి కార్మికులు ఈ విధమైన దోపిడీ పీడనలకు, తీవ్ర సామాజిక వివక్షకు గురవుతున్నప్పుడు, ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం (1989)ను వర్తింపజేసి, తగిన భద్రత, రక్షణ కల్పించవలసి ఉంటుంది. కానీ, ఎక్కడా ఇది అమలు కావడం లేదు. అంతే కాదు, పదిహేడవ అధికరణం కింద, అంటరానితనం, కుల వివక్షలను నిషేధించిన రాజ్యాంగాన్ని ఆయా యాజమాన్యాలు, ప్రభుత్వాలు కూడా ఉల్లంఘిచటం వాటి బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట.
సఫాయి కర్మచారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2014)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, రాష్ట్రాలు చట్టాలకు కట్టుబడి తమ విధులను పాటించకపోవడం...పారిశుధ్య కార్మికుల విషయంలో రాజ్యాంగాన్ని (అధికరణం పదిహేడును), సంబంధిత చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
- కృపాకర్ పొనుగోటి
సెల్ : 9948311667










