Nov 01,2022 00:06

కలెక్టర్‌ కు వినతిపత్రం అందజేస్తున్న నక్కపల్లి నేతలు

వప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని చినతీనార్ల గ్రామంలో నెలకొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని సర్పంచ్‌పై అనకాపల్లిలో సోమవారం నిర్వహించిన స్పందనలో జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌కు ఫిర్యాదు చేసినట్లు మత్స్యకారు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కంబాల అమ్మోరియ్య తెలిపారు. సర్వే నెంబర్‌ 145లో 8 ఎకరాల 90 సెంట్లు చెరువును ఎటువంటి అనుమతులు లేకుండా చెరువుగట్టు తవ్వి కప్పి వేశారని, శ్మశాన వాటిక స్థలాన్ని జగనన్న కాలనీకి కేటాయించారని, మత్స్యకారులు మీటింగులు నిర్వహించడానికి ఉపయోగించే పెంకుటిల్లును పడగొట్టేం దుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
హెటిరో యాజమాన్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు
నక్కపల్లి: మండలంలోని రాజయ్యపేట సమీపంలో ఉప్పుటేరులో హెటిరో డ్రగ్స్‌ రసాయన వ్యర్ధ జలాలు విడుదల చేయడంతో టన్నులకొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయని జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కు అనకాపల్లిలో స్పందనలో సోమవారం ఫిర్యాదు చేసినట్లు మత్స్యకార జేఏసీ నాయకులు వాసిపిల్లి నూకరాజు, గోసల స్వామి తెలిపారు. హెటిరో వ్యర్ధాలతో చేపలు మృత్యువాత పడటంతో మత్సకార్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వెంటనే అధికారులు స్పందించి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. మృత్యువాత పడ్డ చేపలకు సంబంధించిన పరిహారాన్ని మత్స్యకారులకు అందజేయాలని పేర్కొన్నట్లు తెలిపారు. హెటిరో కంపెనీ కొత్తగా వేస్తున్న పైప్‌ లైన్‌కు వ్యతిరేకంగా 336 రోజుల నుండి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారుల ఉపాధిని, ఉనికిని దృష్టిలో పెట్టుకొని పైప్‌ లైన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
గొలుగొండ: మండలంలోని చోద్యం జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల హెచ్‌ఎం రత్నాజీపై అనకాపల్లి కలెక్టర్‌ కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేసినట్లు ఆ పాఠశాల స్కూల్‌ కమిటీ చైర్మన్‌ ధనిమిరెడ్డి అచ్చయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ హైస్కూల్‌కు నాడు నేడులో భాగంగా రెండు క్లాస్‌ రూములకు గాను రూ.62 లక్షల రూపాయలు మంజూరు అయినట్టు తెలిపారు. ఈ పనుల్లో భాగంగా హెచ్‌ఎం రత్నాజి అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిసి హెచ్‌ఎంను వివరణ అడగ్గా పొంతన లేని సమాధానం చెబుతూ నువ్వు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారని తెలిపారు. తాను ఎక్కువ అతి చేస్తే కమిటీ సభ్యులతో సంతకాలు పెట్టించి చైర్మన్‌ పదవి ఊడపీకేస్తానని, పరువు నష్టం దావా వేస్తానని బెదిరిస్తున్నారని ఛైర్మర్‌ ఆరోపించారు. తక్కువ డబ్బులకు మెటీరియల్‌ కొంటూ ఎక్కువ డబ్బులు విత్‌డ్రా చేసుకొని ప్రభుత్వం అందించిన సొమ్మును సొంత ఖాతాలో వేసుకుంటున్నారని చైర్మన్‌ ఆరోపించారు. మెటీరియల్‌ కొన్నప్పుడల్లా తాను వచ్చి సంతకం పెట్టి వెళ్లాలని లేదంటే తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయని బెదిరిస్తూ రాజకీ నాయకులతో కుమ్మక్కై వ్యవహారం నడుపుతున్నారని తెలిపారు.
రోడ్డు మరమ్మతుకు వినతి
నర్సీపట్నం రూరల్‌: మున్సిపాలటీ 25వ వార్డులో సరస్వతీ జంక్షన్‌ రోడ్డు నిర్మాణం చేయాలని 25వ వార్డు కౌన్సిలర్‌ చింతకాయల రాజేష్‌ సోమవారం స్పందన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవిప ఠాన్‌ శెట్టికి వినతపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్‌ మాట్లాడుతూ, వార్డులో సరస్వతి జంక్షన్‌ రోడ్డులో హౌల్‌ సేల్‌ షాపులు, బుక్‌ స్టోర్లు ఎక్కువగా ఉండటంతో నిరంతరం రద్దీగా ఉంటుందన్నారు. ఈ రోడ్డు గుంతలతో అధ్వాన్నంగా ఉందన్నారు. కల్వర్టు ఎత్తుగా ఉండి రోడ్డు కిందకి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. సరిపడా నిధులు సమకూర్చి టెండర్లు పిలిచి, త్వరితగతిన రోడ్డు చేపట్టాలని కోరారు.