ప్రజాశక్తి-పాడేరు:స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలో శుక్రవారం నిర్వహించిన స్పందనకు 76 అర్జీలు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ జె.శివ శ్రీనివాసు, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. రహదారుల నిర్మాణాలు, అంగన్వాడీ కేంద్రాలు మంజూరు, సిసి రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు, భూ సమస్యలపై అత్యధికంగా వినతి పత్రాలు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి స్పందనలో అధికారులు స్వీకరించిన ఫిర్యాదుల వివరాలు ఇవి. 2018 నుండి 2020 వరకు నిర్మించిన ఇళ్లకు బిల్లులు మంజూరు చేయాలని ముంచంగిపుట్టు మండలం జర్జుల గ్రామ పంచాయతీ సర్పంచ్ డి.పార్తిమ వినతి పత్రం సమర్పించారు. బుర్జగుంట, కులబీరు, సిరగంపుట్టు, పెద తమ్మంగుల గ్రామాలకు సిసి రోడ్లు మంజూరు చేయాలని కోరారు. పాడేరు మండలం వర్తనాపల్లి కాలనీకి తాగునీటి సదుపాయం కల్పించాలని వినతి పత్రం అందజేసారు. డుంబ్రిగుడ మండలం గుంటసీమ పంచాయతీ తడ్డ గ్రామస్తులు తడ్డ గ్రామం నుండి తూటంగికి తూటంగి గ్రామం నుండి నేరేడు వలస గ్రామాలకు రోడ్లు నిర్మించాలని కోరారు. అరకు వ్యాలీ మండలం బొండాం పంచాయతీ పరిధిలోని నిన్నిమామిడి, రంగిని వలస గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణాలు పూర్తి చేయాలని సర్పంచ్ దురియా భాస్కరరావు వినతి పత్రం సమర్పించారు.డుంబ్రిగుడ మండలం తూటంగి పంచాయతీ బొడ్డపుట్టు గ్రామానికి సిసి రోడ్డు, డ్రైనేజీ మంజూరు చేయాలని సర్పంచ్ జి.కమల దరఖాస్తును అందజేసారు.వై.రామవరం మండల కేంద్రానికి చెందిన పల్లాల రవి కుమారి, తన కుమారుడు శశి కిరణ్ పేరును రేషన్ కార్డులో నమోదు చేయాలని దరఖాస్తును సమర్పించారు. కొయ్యూరు మండలం చిట్టెంపాడు హైస్కూలు వెళ్లే మార్గంలో సిసి రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తుడు టి.రమణబాబు కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, జిల్లా వ్యవసాయా ధికారి ఎస్.బి.ఎస్.నంద్, గిరిజన సంక్షేమ శాఖ ఇఇలు డి.వి.ఆర్. ఎం.రాజు, కె.వేణు గోపాల్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇఇ లీలా క్రిష్ణ, జిల్లా ఉద్యానవన అధికారి రమేష్ కుమార్‌రావు, కాఫీ ఎడి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు లింకేజీ పంపిణీ
పాడేరు:ఐటీడీఏలోని శుక్రవారం జరిగిన స్పందన కార్యక్రమంలో 175 స్వయం సహాయ సంఘాలకు రూ.2 కోట్ల 51 లక్షల 85 బ్యాంకు లింకేజీ చెక్కును జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఐటిడిఏ పి వి అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ చేతుల మీదుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు పంపిణీ చేసారు. హుకుంపేట మండలం లోని 60 సంఘాలకు రూ.కోటి, 28 లక్షల 85, ముంచంగిపుట్టు మండలంలోని 115 సంఘాలకు రూ.కోటి 23 లక్షల చెక్కును పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి వి.మురళి, ఎపిఎంలు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.










