Aug 18,2023 23:03

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌, జెసి తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతినెలా మూడవ శుక్రవారం నిర్వహిస్తున్న ప్రత్యేక స్పందన కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షోకాజు నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటశివరామిరెడ్డి, డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావుతో కలిసి ప్రభుత్వ, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నుండి 29 ఫిర్యాదులను కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి స్వీకరించారు. అంతకు ముందు స్పందన కార్యక్రమానికి గైర్హాజరైన అధికారుల వివరాలను అడిగి అసహనాన్ని వ్యక్తం చేశారు. స్పందనకు గైర్హాజరైన అధికారులకు వెంటనే షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రతి సోమవారం జరిగే స్పందనకు, మూడవ శుక్రవారం జరిగే ప్రభుత్వ ఉద్యోగుల స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులంతా తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ నుండి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్పందనకు గైర్హాజరైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గత మాసంలో అందిన ఫిర్యాధుల పరిష్కారంపై కలెక్టర్‌ సమీక్షించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. వారి పరిధిలో పరిష్కరించగలిగే అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై తీసుకున్న చర్యలపై సమీక్షిస్తూ.. అధికారులు పరిష్కరించిన అంశాలకు సంబంధించి ఫిర్యాదుదారునికి జారీ చేసిన ఉత్తర్వులు/లేఖలను ఆన్‌లైన్‌లో తప్పక ఉండాలన్నారు. కార్యక్రమంలో సిపిఒ శేషశ్రీ, డిఆర్‌డిఎ, డ్వామా, హౌసింగ్‌ పీడీలు హరిహరనాథ్‌, యుగంధర్‌కుమార్‌, వేణుగోపాల్‌, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ హనుమంతరావు, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ జయరామకష్ణ, సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూదనరావు, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటేశ్వర్లు, డిపిఒ కేశవరెడ్డి, డిఎంహెచ్‌ఒ శ్రావణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.