Jul 24,2023 21:15

అర్జీదారులు లేక బోసిపోయిన ఆర్‌డిఒ కార్యాలయం

రాజంపేట అర్బన్‌ : ప్రతి సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో ప్రజల నుంచి ప్రజా వినతుల కార్యక్రమాన్ని చేపట్టి పరిష్కార దిశగా కషి చేస్తూ ప్రజల సమస్యలను శీఘ్రంగా పరిష్కరించేవారు. సోమవారం ఆర్‌డిఒ కార్యాలయం అర్జీదారులు లేక వెలవెలబోయింది. ఇక్కడ ఇన్‌ఛార్జి ఆర్‌డిఒగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.భాస్కర్‌ బదిలీపై వెళ్లడంతో రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామిని ఇన్‌ఛార్జి ఆర్‌డిఒగా యమించినట్లు సమాచారం. ఇన్‌ఛార్జి ఆర్‌డిఒగా కూడా కార్యాలయంలో లేకపోవడంతో స్పందన అర్జీదారులు వెనుతిరిగిపోవడంతో ప్రజలు లేక ఆర్డిఓ కార్యాలయం బోసిపోయింది. రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన రాజంపేట ఆర్‌డిఒ కార్యాలయం బ్రిటిష్‌ వారి పరిపాలనా కాలం నుంచి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని ఒక వెలుగు వెలిగిందని చెప్పడంలో సందేహం లేదు. జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించినప్పటి నుంచి రాజంపేటలోని ముఖ్య కార్యాలయాలన్నీ రాయచోటికి తరలిపోవడంతో రాజంపేటకు ప్రాధా న్యత తగ్గుతూ వస్తోంది. రాజంపేటలో ఏడాది సమయంలో ముగ్గురు సబ్‌ కలె క్టర్లు, ఇద్దరు ఆర్డీవోలు మారిన తంతు చూస్తేనే రాజంపేట పాలనాపరంగా ఏ స్థాయిలో దిగజారిందో అర్థమవుతుంది. ఏ ఉన్నతాధికారి కూడా రాజంపేటలో ఎక్కువ కాలం విధులు నిర్వహించలేరని, ఇందుకు ప్రధానంగా రాజకీయ ఒత్తిళ్లే కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా రాజంపేట డివిజన్‌ కేంద్రం అన్న విషయాన్ని గుర్తించి స్థాయి అధికారిని సబ్‌ కలెక్టర్‌గా నియమించి రాజంపేట అభివద్ధికి సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.